ఏపీలో పొత్తులపై అమిత్ షా పరోక్షంగా సంకేతాలు ఇచ్చి వెళ్లారు. విశాఖలో నిర్వహించిన జన సంపర్క అభియాన్ బహిరంగసభలో మాట్లాడిన ఆయన… ఎన్డీఏ పక్షాలకు ఇరవై సీట్లను ఇవ్వాలని ప్రజలను కోరారు. మామూలుగా ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే … బీజేపీకి ఇరవై సీట్లు ఇవ్వాలని కోరేవారు. అయితే ఎన్డీఏ ప్రత్యేకంగా చెప్పడంతో కొత్త పొత్తులపై అమిత్ షా సంకేతాలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
నిజానికి ఇప్పటికీ బీజేపీతో జనసేన పొత్తు అధికారికంగా ఉంది. రెండుపార్టీలు పొత్తులో ఉన్నామని చెప్పుకుంటున్నాయి. కానీ ఎవరూ కలవడం లేదు. రాష్ట్ర బీజేపీ నేతల తీరుపై పవన్ అసంతృప్తిగా ఉన్నారు. వారితో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అమిత్ షా కూడా ఎన్డీఏ అన్నారు కానీ బీజేపీ, జనసేన కూటమికి అనలేదు. అసలు జనసేన ప్రస్తావన తీసుకు రాలేదు. ఇటీవలి కాలంలో ఎన్డీఏలోకి కొత్త పార్టీలను తీసుకు రావాలని అమిత్ , షా మోదీ గట్టిగా ప్రయత్నిస్తున్నారని వదిలి పెట్టి వెళ్లిపోయిన పార్టీలను మళ్లీ ఆహ్వానిస్తున్నారని అంటున్నారు.
వ్యవసాయ చట్టాల కు వ్యతిరేకంగా కూటమి నుంచి వెళ్లిపోయిన అకాలీ దళ్ మళ్లీ బీజేపీతో జత కట్టేందుకు సిద్ధంగా ఉంది. దక్షిణాది నుంచి టీడీపీ, జేడీఎస్ వంటి పార్టీలను ఆహ్వానిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఏపీలో ఎన్డీఏ ప్రస్తావన తీసుకు రావడంతో బీజేపీ కొత్త పొత్తుల గురించి విస్తృత ప్రచారం జరుగుతున్నట్లుగా రాబోయే రోజుల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.