తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు బిల్లుల విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. వారికి బిల్లులు మామూలుగానే వస్తున్నాయి. వాడుకున్న కరెంట్ తో పాటు కస్టమర్ చార్జెస్ వసూలు చేస్తున్నారు. వారి కరెంట్ బిల్లు చాలా ప్లెయిన్ గా కనిపిస్తుంది. కానీ ఏపీలో కరెంట్ బిల్లును చూస్తే.. అసలు కన్నా కొసరు ఎక్కవన్నట్లుగా బిల్లు కన్నా ఇతర చార్జీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ట్రూప్ అప్ , ఒకటో ఎఫ్‌పీపీసీఏ, రెండో ఎఫ్‌పీసీసీఏ, కస్టమర్ చార్జీలు , ఫిక్సుడు చార్జీలు ఇలా కనీసం ఆరేడు రకాల వడ్డింపులతో బిల్లును షాక్ కొట్టిస్తున్నారు.
అదనపు బాదుడుకు.. ఏపీ ప్రభుత్వం చెబుతున్న కారణం బహిరంగ మార్కెట్ నుంచి కరెంట్ కొన్నాం.. ఎక్కువ ఖర్చు అయిందని. తెలంగాణ ప్రభుత్వం కూడా బయట నుంచే భారీగా కొంటుంది. అలా కొనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తుంది. కానీ అక్కడ ప్రభుత్వం ట్రూ అప్ చార్జీలు ప్రజలపై భారం మోపలేదు. ఇందర సర్దుబాటు చేయలేదు. ఇతర అడ్డగోలు చార్జీలేమీ వేయలేదు. వాడుకున్నదానికి మాత్రమే బిల్లు వేస్తున్నారు. ఏపీలో ఇంత దారుణంగా విద్యుత్ వినియోగదారుల్ని దోపిడీ చేస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాని విషయం.
అలాగే తెలంగాణలో ఎక్కడా స్మార్ట్ మీటర్లు అనే ప్రస్తావన రావడం లేదు. కానీ ఏపీలో మాత్రం విచ్చలవిడిగా స్మార్ట్ మీటర్లు పెట్టేయడానికి అస్మదీయులుకు కాంట్రాక్టులు పంచేశారు. పది వేలు కూడా ఉండని స్మార్ట్ మీటర్ ను .. అనంతర సేవలు పేరుతో ముఫ్పై వేలకు పెంచేసి… ఆ మొత్తాన్ని ప్రజల దగ్గర నుంచి పిండుకోవడానికి రెడీ అయిపోయింది. స్మార్ట్ మీటర్లు పెడితే ప్రతీ నెలా మరో నూటయాభై రూపాయల వరకూ అదనంగా బిల్లులో జమ అవుతుంది.
పరిపాలించమని ప్రజలు అధికారం ఇస్తే… వనరుల్నే కాదు ప్రజల్ని కూడా అడ్డగోలుగా దోచుకునే విధానాలకు ప్రభుత్వం ఫిక్సవుతోంది. ప్రజల బాధల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. పొరుగు రాష్ట్రాన్ని చూసి అయినా నేర్చుకోవడం లేదు.