బీహార్లో కిడ్నాపులు అనేది ఓ కుటీర పరిశ్రమగా ఉండేదని.. అందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడ అలా ఉందో లేదో కానీ ఏపీలో మాత్రం అలాగే తయారయింది. ఇప్పటి వరకూ ఎన్నో కిడ్నాప్ ఘటనలు వెలుగు చూశాయి. ఆస్తులు రాయించుకుని వదిలేశారని కేసులూ నమోదయ్యాయి.. ఇప్పుడు ఏకంగా విశాఖ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేసేశారు. విశాఖ ఎంపీ భార్య, ఆయన కుమారుడితో పాటు … వారికి సన్నిహితుడైన ఆడిటర్.. జీవీగా విశాఖలో దందాలకు మారుపేరుగా మారిన గన్నమనేని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కిడ్నాపయ్యారు.
రుషికొండ సమీపంలో ఎంపీ ఇల్లు ఉంది. ఆయన వ్యాపార వ్యవహారాల నిమిత్తం హైదరాబాద్లో ఉన్నారు. ఈ సమయంలో ఇంట్లొకి చొరబడిన దుండగులు.. ఎంపీ భార్య, కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారి ద్వారా ఆడిటర్ జీవీని కూడా పిలించి ..ఆయనను కూడా కిడ్నాప్ చేశారు. ఆడిటర్ జీవీ స్మార్ట్ సిటీ కార్పొరేష్ మాజీ డైరక్టర్ కూడా. ఈ కిడ్నాప్ వ్యవహారం బయటకు రావడంతో సంచలనం సృష్టించింది. పోలీసులు ఓ ఇరవై బృందాలను ఏర్పాటు చేసి.. కిడ్నాపర్లను అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు.
ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు ఏ వివరాలను బయటకు వెల్లడించడం లేదు. అయితే ఆడిటర్ జీవీ అలియాస్ గన్నమనేని వెంకటేశ్వరరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మధ్య చాలా కాలంగా భూ వివాదాలు ఉన్నాయని భావిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో ఇద్దరూ కలిసి వ్యాపారం చేసేవారు. ఇటీవల వారి మధ్య విబేధాలు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
పోలీసులు మాత్రం కిడ్నాప్ కథ సుఖాంతమయిందని..ఎంపీ భార్యతో పాటు కుమారుడ్ని కూడా విడిపించామని నిందితుల్ని అరెస్ట్ చేశామని.. మీడియాకు అనధికారిక సమాచారం ఇచ్చారు. ఈ ఘటన వెనుక రౌడీషీటర్ హేమంత్ ఉన్నారని చెబుతున్నారు. అసలు ఎంపీ కుటుంబసభ్యుల్నే కిడ్నాప్ చేసేంత ధైర్యం ఓ సాధారణ రౌడీషీటర్ ఎందుకు చేస్తారన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింంది. ఏపీలో .. ఏమైనా జరగొచ్చని.. ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని.. సెటైర్లు సహజంగానే వస్తన్నాయి.