తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ … కేసీఆర్ పథకాలన్నీ కొనసాగిస్తామని.. చివరికి ధరణి పోర్టల్ ను కూడా కొనసాగిస్తామని ప్రకటించేశారు. ఆయన ప్రకటన బీఆర్ఎస్ నేతల్ని ఫక్కున నవ్వేలా చేసింది. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని ఇప్పటి వరకూ బండి సంజయ్ చెబుతూ వచ్చారు. కానీ హఠాత్తుగా రద్దు చేయబోమని కొనసాగిస్తామని చెబుతున్నారు. అంతేనా.. మళ్లీ కేసీఆర్ పథకాల ప్రస్తావన తీసుకు వచ్చారు. వాటన్నింటినీ అమలు చేస్తామని చెప్పారు. వాటి కోసమే అయితే.. కేసీఆర్ కే ఓటేసుకోవచ్చు కదా.. బీజేపీకి ఎందుకు వేయాలనే సందేహం సగటు ఓటర్ కు వస్తుందని బండి సంజయ్ కు అనిపించలేదు.
ధరణి విషయంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో… టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ధరణి పోర్టర్ రద్దుకు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి హామీ ఇప్పించారు. ధరణి పోర్టల్ పై ముందు నుంచీ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న బీజేపీ కూడా ఇదే హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు లోపాలు సవరించి..ధరణి పోర్టల్ కొనసాగిస్తామని… బండి సంజయ్ యూటర్న్ తీసుకోవడం బీజేపీకి ఇబ్బందికరమే.
ఇటీవల ధరణి పోర్టల్ ను వ్యతిరేకించే వారిపై కేసీఆర్ ఎదురుదాడికి దిగుతున్నారు. ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు రావని చెబుతున్నారు. అసలు రైతు బంధుకు.. ధరణికి సంబంధం ఏమిటని.. కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ.. కేసీఆర్ వ్యూహంలో బండి సంజయ్ చిక్కుకున్నారు. ధరణికి అనుకూలంగా మాట్లాడటం ప్రారంభించారు. కేసీఆర్ పై ఎన్ని ఆరోపణలు చేసినా.. కాంగ్రెస్ ను ఎన్ని తిట్టినా… బీఆర్ఎస్ చేస్తున్నవన్నీ మంచివేనని.. కొనసాగిస్తామని చెబితే.. మరి బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలన్న ప్రశ్న సగటు ఓటర్కు వస్తుంది. ఈ లాజిక్ బండి సంజయ్ ఎలా మిస్సయ్యారో ?