సొంత ఎంపీ కుటుంబసభ్యుల్ని కిడ్నాప్ చేసి.. రెండు రోజుల పాటు నిర్బంధంలో ఉంచారని తెలిస్తే.. ప్రభుత్వాధినేత ఎలా స్పందించాలి? ఊహించనంతవేగంగా స్పందించాలి. ఎందుకంటే ఇది ఎంపీ సొంత కుటుంబ వ్యవహారం మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించిన అంశం కూడా. కానీ సీఎం జగన్ ఏం చేశారు ? అసలు పట్టించుకున్నట్లుగా లేరు. ఈ మొత్తం వ్యవహారం ముందుగానే ఆయనకు తెలుసో లేదో కానీ..ఆయన మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. డీజీపీ కూడా.. ఓ రోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత.. ప్రెస్ మీట్ పెట్టి.. శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని.. రౌడీ షీటర్లందర్నీ ఏరేశామని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకునివెళ్లిపోయారు.
అదే సమయంలో .. బాపట్లలో ఓ చిన్న పిల్లగాడ్ని.. ఓ వెంకటేశ్వరరెడ్డి పెట్రోల్ పోసి తగులబెట్టేశాడు. మరో చోట వైసీపీ నేతుల ఇంట్లో నుంచి మనుషుల్ని బయటకు లాక్కొచ్చి కెట్టారు. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సీఎం జగన్ మాత్రం.. హాయిగా తాడేపల్లిలో.. తాను నొక్కబోయే బటన్ల గురించి మీడియాలో ప్రచారం గురించి ఆలోచిస్తున్నట్లుగా ఉన్నారు. కనీసం ఎంపీని పరామర్శించారని కానీ.. బాపట్లలో జరిగిన ఘోరం గురించి తెలుసుకుని.. కఠిన చర్యలకు ఆదేశించారన్న ప్రెస్ నోట్లు కూడా విడుదల చేయలేదు.
పోలీసు వ్యవస్థ మొత్తం నిర్వర్యం అయిపోయిందని.. ఇష్టారీతిన రాష్ట్రమంతా రౌడీలు చెలరేగిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నా స్పందించడం లేదు. ఇదే కాదు… గతంలో సొంత కేబినెట్ లోని దళిత మంత్రి ఇంటిపై అల్లరిమూకలు దాడి చేస్తే ఆయనను కనీసం పరామర్శించలేదు సరి కదా.. దాడి చేసిన వారి కేసులన్నీ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ నేరస్తుల్లో ధీమాను పెంచుతూండటం వల్లనే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు తగ్గిపోతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.