తెలంగాణలో కుల వృత్తులపై ఆధారపడిన బీసీలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించే పథకాన్ని కేసీఆర్ ప్రవేశ పెట్టారు. మొత్తం 14 రకాల కులవృత్తులు చేసుకునేవారికి సాయం చేయనున్నారు. ఇందు కోసం అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20 వరకు మాత్రమే గడువు ఇచ్చారు. ఒక్క రోజే గడువు ఉండటంతో దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే ప్రతి అసెంబ్లి నియోజకవర్గంలో 30వేల నుంచి 35వేల వరకు దరఖాస్తులు వచ్చాయి.
బీసీ కులవృత్తుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థికసాయాన్ని ప్రభుత్వం ప్రకటించగానే భారీగా స్పందన వచ్చింది. మీసేవ కేంద్రాలకు జనం క్యూ కట్టారు. అవసరమైన ధృవపత్రాల కోసం పనులన్నీ ఆపేసుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మంగళవారం ఒక్కరోజే గడువు ఉండడంతో ఇంకా దరఖాస్తులు సమర్పించాల్సి ఉన్న అనేకమంది ఆతృత, ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వ అంచనాలకు మించి దరఖాస్తులు అందడంతో అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. చిన్నచిన్న కారణాలతో అర్హత కోల్పోతున్న వారంతా మండల కార్యాలయాల ముందు ఆందోళనకు దిగుతున్నారు.
దరఖాస్తు చేసుకున్న అందరికీ ఇస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే ఇచ్చేది లేదు అని చెప్పడానికి మాత్రం అవకాశం లేదు. ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఇదే. ఇప్పుడు పథకాన్ని ప్రారంభిస్తారు.. ఎతో కొంత మందికి ఇస్తారు. తరవాత ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు ముగియగానే ఇస్తామంటారు. ఇస్తారా లేదా అన్నది తర్వాత సంగతి. రూ. లక్ష రుణమాఫీ ఇచ్చిన రైతుల సంగతే పట్టించుకోలేదు.. ఇక బీసీ సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తారా ? . ఇది ఓట్లు గుద్దించుకోవడానికి మంచి ప్లానే కానీ.. ప్రజలు మోసం చేస్తున్నారని అనుమానిస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది.