వైకాపా నేతలు, వైకాపా సపోర్టర్ల టార్గెట్ ఇప్పుడు వపన్ మాత్రమే. పవన్ ఇమేజ్‌ని ఎంత డామేజ్ చేస్తే.. తమ పార్టీ అంత బలపడుతుందనే భ్రమల్లో ఉన్నారంతా. అందుకే ఎవరు మైకు పట్టుకొన్నా, ఎవరు మీడియా ముందుకొచ్చినా పవన్ ని దుమ్మెత్తి పోయడం, సవాళ్లు విసరడం, చులకన చేయడం… ఆనవాయితీగా మారింది. రాంగోపాల్ వర్మ కూడా ఆ తానులో ముక్కే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆయన అదే మిషన్‌లో ఉన్నారు. `నిజం` అనే ఓ యూ ట్యూబ్ ఛానల్ పెట్టి – పవన్‌ని తిట్టడమే పనిగా పెట్టుకొన్నారు.
ఇప్పుడు `వ్యూహం` అనే ఓ సినిమా రూపొందిస్తున్నారు. జగన్ రాజకీయాలు, ఆయన గొప్పదనం, ప్రవేశ పెట్టిన పథకాలు, జగన్ డేరింగ్ – డాషింగ్ నైజం.. ఇవన్నీ తెరపై చూపించాలన్నది ఆయన లక్ష్యం. 2024 ఎన్నికలకు వైకాపాకు సాయంగా ఉంటుందని ఈ సినిమాని తీస్తున్నారు. ఇందులో ట్విస్టేంటంటే… పేరుకే జగన్ సినిమా ఇది. ఇందులో అసలు హీరో మాత్రం పవనే అట. పవన్ కి సంబంధించిన చాలా అంశాలు, విషయాలు, వివాదాలూ… ఈ సినిమాలో సన్నివేశాలుగా కనిపిస్తాయని తెలుస్తోంది. రామూ ఇది వరకు పవన్ పై ఓ సినిమా తీశాడు. అందులో కనిపించిన నటీనటులు కొంతమందిని ఈ సినిమాలోనూ రిపీట్ చేయబోతున్నాడని తెలుస్తోంది.టార్గెట్ మాత్రం ఒక్కటే పవన్‌ని కార్నర్ చేయడం. అందుకోసం సోషల్ మీడియాలో వచ్చిన గాసిప్పులు, పవన్ వ్యతిరేక వర్గం మాట్లాడుకొనే విషయాలూ.. సన్నివేశాలుగా గుదగుచ్చాడట.
రాజుగారి రెండో భార్య అందంగా ఉంటుందంటే మొదటి భార్య బాగోదన్నది పరోక్ష అర్థం. ఇక్కడ రాము రివర్స్.. రాజు గారి.. రెండో భార్య బాగోదు అంటే.. చచ్చినట్టు మొదటి భార్య బాగుంటుందని ఒప్పుకొన్నట్టే. పవన్ అసమర్థుడని చెబితే, జగన్ సమర్థుడని ప్రజలు నమ్మేస్తారన్నది వర్మ వ్యూహం కావొచ్చు. మరి ఇది వర్కవుట్ అవుతుందా???