రాజమౌళి సీక్వెల్ సినిమాలెప్పుడూ తీయలేదు. ప్రతీసారీ ఓ కొత్త కథ చెప్పడానికి ప్రయత్నించాడంతే. ఈగ 2 వస్తుందని అనుకొన్నారు.. అదెందుకో కార్యరూపం దాల్చలేదు. అయితే `ఆర్.ఆర్.ఆర్`కి సీక్వెల్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎప్పుడూ లేనిది సీక్వెల్‌పై రాజమౌళి మనసు మళ్లింది. ఆర్.ఆర్.ఆర్కి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గుర్తింపు, సీక్వెల్ చేయడానికి అనువైన వేదిక ఆర్.ఆర్.ఆర్కి దొరకడంతో రాజమౌళి ఆలోచనలు అటువైపుగా మళ్లాయి.
ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ తీస్తే గనుక హాలీవుడ్ ని టార్గెట్ చేయడానికి రాజమౌళి ఫిక్సయిపోయాడు. నేరుగా ఓ ఇంగ్లీష్ చిత్రమే తీసి, దాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలన్నది రాజమౌళి ప్లాన్. కాకపోతే.. ఈసినిమాకి దర్శకుడు రాజమౌళి కాకపోవొచ్చు. ఓ హాలీవుడ్ దర్శకుడికి బాధ్యతలు అప్పగించి, తాను దర్శకత్వ పర్యవేక్షణ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ సైతం ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా చెప్పేశారు. ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ తీసే ఆలోచన రాజమౌళికి ఉందని, ఈసారి హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తారని, హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తారని, రాజమౌళి ఈ సినిమాని టేకప్ చేస్తాడా, మరొకరికి అప్పగిస్తాడా? అనేది ఇప్పుడే చెప్పలేనని ఈ సినిమా గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
రాజమౌళి ప్రస్తుతం మహేష్‌బాబు సినిమాపై ఫోకస్ పెట్టారు. ఆ తరవాత… మహాభారతం తీయాలన్నది ఆయన ఆలోచన. మహాభారతం రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్. దాదాపు 10 భాగాల సినిమా. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక ఆయన రిటైర్మెంట్ తీసుకొంటారట. అంటే మహేష్ సినిమా తరవాత మహాభారతం తప్ప మరో ప్రాజెక్టు రాజమౌళి టేకప్ చేయడు. అందుకే ఆర్.ఆర్.ఆర్ 2 బాధ్యత మరొకరికి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.