వాలంటీర్లపై పవన్ కల్యాణ్ అంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే.. పేర్ని నాని మీడియా ముందుకు వచ్చారు కానీ.. కొడాలి నాని బయటకు రాలేదు. దీంతో కొడాలి నాని ఎక్కుడున్నారని… మీడియా ప్రతినిధులు వెదకడం ప్రారంభించారు. కానీ ఆయన విజయవాడలో లేరు. హైదరాబాద్ లో ఉన్నారో లేదో తెలియలేదు. మామూలుగా అయితే ఇలాంటి సమయంలో.. పవన్ కల్యాణ్ కు బూతుల కౌంటర్ ఇప్పించేందుకు కొడాలి నానిని కూడారంగంలోకి దింపుతారు.
కొడాలి నానికి ఆరోగ్యం బాగోలేదని ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్న ప్రచారం ఈ కారణంగానే బయటకు వచ్చింది. ఆయన అనారోగ్యంపై రకరకాల ప్రచారం జరుగుతున్నప్పటికీ నిజమేమిటో స్పష్టత లేదు. ఆయన కుటుంబసభ్యులు ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. కరోనా వచ్చినప్పుడు ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందినప్పటి నుండి ఆయన… గుడివాడలో ఉంటున్నది తక్కువేనని.. ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నారని అంటున్నారు.
హైకమాండ్ ప్రెస్ మీట్లు పెట్టాలనుకున్నప్పుడే పెడుతున్నారని అంటున్నారు. గడప గడపకూ కార్యక్రమాన్ని అతి తక్కువ రోజులు నిర్వహించిన ఎమ్మెల్యేల్లో కొడాలి నాని ఒకరు. కొడాలి నాని గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాలు జరుగుతున్నా… వాటిని ఖండించడమో.. లేకపోతే.. ఆయనే బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడటమో చేయాల్సింది. అది కూడా చేయకపోవడంతో మరింత ఎక్కువగా ప్రచారం జరుగుతోంది.