ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాలో భాగమయ్యారంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు సంచలనాత్మకయ్యాయి. ఇందులో నిజానిజాలు ఎన్ని ఉన్నాయన్న సంగతి పక్కన పెడితే.. ఒక్క సారిగా వాలంటీర్ల వ్యవహారంపై చర్చ ప్రారంభమయింది. వాలంటీ్లు ఎవరు ? వారి విధులేంటి ? ప్రజల వ్యక్తిగత డేటా వారి వద్ద ఎందుకు ఉంటోంది ? ఇవన్నీ ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. అదే సమయంలో వాలంటీర్లు అనేక రకాల నేరాల్లో పాల్గొన్న ఘటనలకు సంబంధించిన వార్తలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ వాలంటీర్ల వ్యవహారాన్ని.. ప్రజల్లోకి చర్చ పెట్టాలనుకున్నారని అందుకే.. ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. వాలంటీర్లకు రూ. ఐదు వేలిచ్చి మన ఇళ్లల్లో దూరే అవకాశం ఇచ్చారని పవన్ చెబుతున్నారు. వారి పొట్ట కొట్టే ఉద్దేశం లేదని కూడా అంటున్నారు. వాలంటీర్లపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. కానీ వారికి ప్రభుత్వం ఇస్తున్నప్రాధాన్యం చూసి చాలా మంది ప్రశ్నించడానికి బయపడుతున్నారు. ఎందుకంటే.. వారి డేటా అంతా వారి గుప్పిట్లోనే ఉంటుంది.
నిజానికి వాలంటీర్ల విషయంపై ఎమ్మెల్యేలోనూ అసంతృప్తి ఉంది. గతంలో ఎలాంటి పని కావాలన్నా ప్రజలు ఎమ్మెల్యే ద్గగరకు వచ్చేవారు.ఇప్పుడు వాలంటీర్ ద్వారా.. చక్క బెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా తమకు వాలంటీర్లకు ఉన్నంత వాల్యూ లేదని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా సీఎం జగన్ రాజకీయ కోణంలోనే ఏర్పాటు చేశారన్నది ఎక్కువ మంది నమ్మే మాట. అందుకే పవన్.. ఆ వ్యవస్థలోని లోపాలను వ్యూహాత్మకంగా బయటపెట్టి.. ప్రజల్లో చర్చకు పెట్టారని అంటున్నారు.