తమిళ హీరో శివ కార్తికేయన్ సినిమాలకు తెలుగులో కాస్తో కూస్తో క్రేజ్ ఏర్పడింది. వరుణ్ డాక్టర్ సినిమా మంచి వసూళ్లు తెచ్చుకొంది. ప్రిన్స్ తో తెలుగులో నేరుగా ఓ సినిమా చేసిన శివ కార్తికేయన్ ఇక్కడ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ని ఏర్పాటు చేసుకోగలిగాడు. ఇప్పుడు తన నుంచి మరో సినిమా వస్తోంది. అదే.. `మహావీరుడు`. ఈనెల 14న విడుదల అవుతోంది. ట్రైలర్ ఇంట్రస్టింగ్ గానే ఉంది. తను మరో కొత్త కథ చెబుతున్నాడన్న నమ్మకం ఏర్పడింది. అయితే ఈ సినిమాకి ఎందుకనో బజ్ లేదు. తెలుగులో ప్రమోషన్లు కూడా పెద్దగా చేయడం లేదు. ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసి, చేతులు దులుపుకొన్నారంతే.
నిజానికి డాక్టర్, ప్రిన్స్ లాంటి సినిమా తరవాత.. తెలుగులో ఓ మంచి మార్కెట్ ఏర్పడిన తరవాత ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అయితే చిత్ర బృందం అదేం పట్టించుకోవడం లేదు. సినిమా బాగుంటే జనాలు వాళ్లంతట వాళ్లే వస్తారన్న నమ్మకం కావొచ్చు. ఈరోజుల్లో ఎంత ప్రమోషన్ చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా అంతిమంగా సినిమా బాగుండాల్సిందే. కాకపోతే యావరేజ్‌గా ఉన్న సినిమాలకు ప్రమోషన్లే ప్రాణం పోస్తాయి. పబ్లిసిటీ పూర్తిగా పక్కన పెట్టేసినా, ఓవర్ చేసినా – నష్టపోయేది సినిమానే.