జల్సా సినిమాలో ఓ సీన్ ఉంటుంది. తుపాకీ ఎవరి చేతిలో ఉంటే వారు చెప్పేదే నిజం. తుపాకీ ఎవరి చేతుల్లో ఉంటుందనేది మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు ఏపీలో కూడా అంతే అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వారు చెప్పేదే వేదం. వ్యవస్థలన్నీ ట్రాష్. రాజకీయం అంటే…. పరిపాలన.. ప్రజా సేవ.. యువతకు ఉద్యోగాలు.. పరిశ్రమల ఆకర్షణ… ఉపాధి.. రోడ్లు.. ప్రజలకు మేలు చేసే పనులు చేయడం ఎంత మాత్రం కాదు. ఆ జమానా ముగిసింది. ఇప్పుడు రాజకీయం అంటే వ్యక్తిగత కక్షలు. అదీ కూడా రాజకీయ ప్రత్యర్థుల మీద తీర్చుకోవడం.
అధికారాన్ని ఉపయోగించి ఎంత బలంగా … ప్రత్యర్థులపై బలప్రయోగం చేస్తే…. వారు అంత బలపడతారు. ఇది చరిత్ర చెప్పిన నిజం.. సాక్ష్యం కూడా. కానీ ఈ బలప్రయోగం ఎందుకు చేస్తారు… వాళ్లని లేకుండా చేయడానికి. అక్కడే అధికార పెద్దలు రాంగ్ స్టెప్ వేస్తారు… కానీ చేస్తారు. తర్వాత ఏమవుతుందో తర్వాత సంగతి. ఇప్పుడు ఏపీలో ఎవరూ అభివృద్ధి గురించి.. పరిశ్రమల గురించి… వ్యాపారాల గురించి.. మనుషుల ఆరోగ్యాల గురించి మాట్లాడుకోవడం లేదు. అధికార పార్టీ వారయితే ప్రత్యర్థిని వేధించడం.. చినీ చెట్లు నరికినట్లుగా మనుషుల్ని లేదా వారి ఆర్థిక మూలాల్ని నరకడం మాత్రమే రాజకీయం. ఇదంతా ఎందుకు చేస్తారంటే అధికారం నిలబెట్టుకోవడానికే.
మరి అధికారం నిలబెట్టుకోలేకపోతే… తర్వాత వచ్చే పార్టీ కూడా అదే చేస్తుంది. చినీ చెట్లను నరికినట్లుగా ప్రజాస్వామ్యాన్ని నరకడం ప్రారంభిస్తుంది. అలా చేయకపోతే తాము చేతకాని వాళ్ల ముద్ర పడిపోతుంది. ఈసైకిల్ ఎక్కడికి పోతుంది..?. ఏపీని వల్లకాడుగా మార్చేవరకూ పోతుంది. దీనికి ప్రారంభించిన వారే బాధ్యులే. చూస్తూ ఉండిపోయిన ప్రజలు కూడా. విషాదం ఏమిటంటే అంతిమ బాధితులు కూడావారే. ఇప్పటి వరకూ ఏదైనా రాజకీయం చేయాలని ఇతర పార్టీల వాళ్లు అనుకుంటారేమో కానీ.. ఇక నుంచి ఏపీలో రాజకీయాలు ఉండవు.. వ్యక్తిగత కక్షలే ఉంటాయి. అదే భవిష్యత్ ను భయపెట్టే అంశం.