చంద్రబాబు అరెస్టు సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతుగా వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సాక్షి ఒక కథనం రాసింది. అయితే ఈ కథనం ద్వారా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయబోయి సాక్షి సెల్ఫ్ గోల్ వేసుకుంది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే
ఇప్పుడు చంద్రబాబును సమర్థిస్తున్న పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుపై ఏ విధంగా విమర్శలు చేశారో వివరిస్తూ సాక్షి, పవన్ కళ్యాణ్ పాత వ్యాఖ్యలను ప్రచురించింది. 2018 మార్చి లో పవన్ మాట్లాడుతూ “మీకు మద్దతు ఇచ్చింది మీరు దోపిడీ చేస్తూ ఉంటే చూస్తూ ఉండడానికా ” అంటూ చేసిన వ్యాఖ్యలను, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా 2018 నవంబర్లో ” కాంగ్రెస్ కంటే రెట్టింపు స్థాయిలో చంద్రబాబు అవినీతి చేస్తున్నారు” అంటూ చేసిన వ్యాఖ్యలను సాక్షి ప్రచురించింది. అదేవిధంగా వేర్వేరు సందర్భాలలో 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని విమర్శించిన వ్యాఖ్యల అన్నింటినీ సేకరించి సాక్షి కథనం ప్రచురించింది.
అయితే 2019 ఎన్నికల సందర్భంగా జగన్ మరియు సాక్షి పవన్ కళ్యాణ్ మీద చేసిన ప్రచారం సాక్షి ప్రచురించిన ఈ కథనంతోనే అబద్ధం అని తేలిపోయింది అంటూ జన సైనికులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏనాడు కూడా చంద్రబాబును విమర్శించడు అని, వారిద్దరూ ఒకటేనని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ అప్పట్లో చంద్రబాబు మీద చేసిన విమర్శలు అన్నింటిని ప్రచురించకుండా దాచిపెట్టిన సాక్షి ఇప్పుడు పవన్ చేసిన పాత విమర్శలను ప్రచురించడం ద్వారా జగన్ అబద్దాలకోరు అని నిరూపించినట్లయింది అని , ఆ రకంగా సాక్షి సెల్ఫ్ గోల్ వేసింది అని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.