సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టు తర్వాత హౌస్ అరెస్ట్, బెయిల్ పిటిషన్ల పని మీద ఉన్న లాయర్ సిద్ధార్ధ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాలని సుప్రీంను వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి కోరారు. దీంతో ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.
వివేకా హత్య కేసు లో A8 అవినాష్‌కి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సునీతా రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేసు విచారణ జరిగింది. అవినాష్ బెయిల్ రద్దుకు మద్దతుగా ఇటీవల సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో A 8గా ఉన్న అవినాష్‌కి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
తన తండ్రి హత్యకు ప్రధాన సూత్రధారి అవినాష్ రెడ్డి అని కేసు దర్యాప్తుకి సహకరించకుండా తప్పించుకుంటున్నారని పిటిషన్లో సునీత పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. వివేకా హత్యకు భాస్కర్ రెడ్డి , అవినాష్ రెడ్డి కుట్ర చేశారని అఫిడవిట్లో సీబీఐ పేర్కొంది. రాజకీయ వైరంతోనే వివేకా హత్య జరిగిందని సీబీఐ స్పష్టం చేసింది. గుండెపోటు అంటూ కట్టుకథ అల్లారని పేర్కొంది. అవినాష్ రెడ్డి పాత్రపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ వెల్లడించింది. వివేకా హత్యకు అవినాష్ రెడ్డి , భాస్కర్ రెడ్డిలే సూత్రదారులు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని అఫిడవిట్లో సీబీఐ పేర్కొంది.
హైకోర్టు ఇతర నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందని అనుకున్నారు. కానీ న్యాయవాది లేకపోవడంతో సునీతారెడ్డినే విచారణ వాయిదా కోరుకోవాల్సి వచ్చింది.