తెలంగాణ బీజేపీ టిక్కెట్ల కోసం బయటకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. ఆరు వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు కేసీఆర్ మీద గజ్వేల్ లో ఇప్పటి వరకూ ఈటల రాజేందర్ పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన భార్య కేసీఆర్ పై పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం ధరఖాస్తుల గడువు ముగిసింది. మొత్తం 6,003 దరఖాస్తులు వచ్చాయి. ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపు రావు, డీకే అరుణ, లక్ష్మణ్ దరఖాస్తు చేసుకోలేదు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుండి దరఖాస్తు చేయగా హుజూరాబాద్ నుండి ఈటెల రాజేందర్, గజ్వే దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణలో బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలనుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికకు సరికొత్త సంప్రదాయాన్ని అమలు చేసిన కమలం పార్టీ అభ్యర్థుల జాబితాపై మూడు దశల్లో వడపోత చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలనకు ఒక కమిటీ ఏర్పాటు చేసి.. జిల్లా, రాష్ట్ర, కేంద్ర పార్టీ స్థాయిలో స్క్రీనింగ్ చేపట్టనున్నారు. రాష్ట్ర పార్టీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత జాతీయ కమిటీకి జాబితా చేరనుంది. ఆ తర్వాతే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. రాష్ట్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన కోసం త్వరలో రాష్ట్ర నాయకత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. మొత్తంగా.. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయి నేపథ్యంలో ఇకపై బీజేపీ మరింత దూకుడు పెంచనున్నట్లు తెలుస్తోంది.
దరఖాస్తు చేయడానికి ఎలాంటి రుసుము పెట్టలేదు. సీనియర్లు చాలా మంది దరఖాస్తు చేయలేదు. వారెవరికీ టిక్కెట్లు ఇవ్వకుండా ఉండే అవకాశం లేదు. బలమైన అభ్యులుగా భావించిన వారు దరఖాస్తు చేసుకోలేదన్నకారణంగా దూరం పెట్టే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు వస్తే కాదనలేని పరిస్థితి ఉంది. అందుకే దరఖాస్తుల ప్రక్రియ అంతా ప్రహసనమని భావిస్తున్నారు.