సెటిలర్ల ఓట్లు కావాలి కానీ వారు నిరసనలు చేసుకోవాలంటే ఏపీకి వెళ్లి చేసుకోమ్మంటారా అని.. కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ పై రేవంత్ రెడ్డి నేరుగా ఇప్పటి వరకూ స్పందించలేదు. కానీ అరెస్టులపై నిరసనలు చేసుకోవడానికి అనుమతిచ్చేది లేదని కేటీఆర్ కామెంట్స్ చేసిన తర్వాత స్పందించారు. చంద్రబాబు అరెస్టు కేసుల గురించి మట్లాడలేదు కానీ..కేటీఆర్ కామెంట్స్ ను మాత్రం తప్పు పట్టారు. పదేళ్ల పాటు హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని, ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటే ఎలా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనలు వ్యక్తం చేస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు విధించడం, ఆందోళన చేయొద్దని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం అర్ధరహితం అని మండిపడ్డారు. అసలు ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏపీకి మాత్రమే సంబంధించిన నాయకుడు కాదని.. ఆయన అరెస్ట్ జాతీయ అంశమని స్పష్టం చేశారు. ఆయన లాంటి అనుభవం ఉన్న వాళ్లను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వైట్ హౌస్ ముందే ధర్నాలు చేశామని.. ఐటీ కారిడార్ లో చేస్తే తప్పేముందన్నారు.
చంద్రబాబు అరెస్టు విషయంలో తెలంగాణలో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ధైర్యంగానే స్పందించారు. బీఆర్ఎస్ హైకమాండ్ మాత్రమే.. తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. రాజకీయ కక్ష సాధింపుల అరెస్ట్ అనే అభిప్రాయంతోనే ఎక్కువ మంది ఉన్నారు. అదే చెబుతున్నారు. టీ పీసీసీ చీఫ్ గా ఉన్నందున.. తన అభిప్రాయం చెబితే.. వివాదం అవుతుందని రేవంత్ రెడ్డి స్పందించలేదు.