గవర్నర్ తమిళి సై విషయంలో కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. గవర్నర్ కోటాలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి పంపారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు గవర్నర్ పై విరుచుకుపడ్డారు. అయితే వెనక్కి పంపేశారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. కానీ కేసీఆర్ వారినే గవర్నర్ కోటాలో మండలికి పంపాలని పట్టుదలగా ఉన్నారని చెబుతున్నారు.
శుక్రవారం జరగనున్న కేబినెట్ భేటీలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను మరోసారి కేబినెట్ ద్వారా సిఫారసు చేయనున్నారు. వీరిద్దరిపై ఎలాంటి కేసులు లేవు. రాజకీయ నేతలు అయి ఉండవచ్చు కానీ దాసోజు శ్రవణ్ ఫ్రొఫెసర్ అని.. కుర్రా సత్యనారాయణ కార్మిక వర్గాల నేత అని చెబుతున్నారు. వారిద్దరూ గవర్నర్ కోటాలో అర్హత ఉందని చెబుతున్నారు. ఏదైనా ఫైల్ గవర్నర్ తిరస్కరించినప్పుడు అదే ఫైల్ నుంచి రెండో సారి పంపితే ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
గవర్నర్ కు ఉన్న అధికారాలు పరిమితమైనవి. ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తిరస్కరించేందుకు అవకాశం ఉంది కానీ… అది ఒక్క సారే. రెండో సారి తిరిగి పంపితే ఆమోదించాల్సి ఉంటుంది. గవర్నర్కు అంతకు మించి అధికారాలు ఉండవని టీఆర్ఎస్ నేతలు కూడా భావిస్తున్నారు. అందుకే కేసీఆర్ మరోసారి వారి పేర్లే పంపనున్నారు. మరి తమిళిశై ఏం చేస్తారో ?