Skanda Movie Review
తెలుగు360 రేటింగ్ : 2.5/5
బోయపాటి శ్రీను సినిమాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులకు ఒక అంచనా వుంది. మాస్ ఆడియన్స్ ని ద్రుష్టిలో పెట్టుకునే కథలు నడుపుతుంటారాయన. ఇప్పుడు రామ్ పోతినేని హీరోగా ‘స్కంద’ సినిమా చేశారు. ప్రచారం చిత్రాలు చూస్తే ఇది పక్కా బోయపాటి మార్క్ సినిమాని అర్ధమైయింది. ఇలాంటి సినిమాలు రామ్ కి మాత్రం కొత్త. బోయపాటి విజయ రహస్యం.. మాస్ యాక్షన్ లో ఎమోషన్ వర్క్ అవుట్ కావడం. బాక్సాఫీసు వద్ద విజయం సాధించిన ఆయన చిత్రాలు గమనిస్తే.. అందులో ఎమోషన్ కి ప్రేక్షకులకి కనెక్ట్ అయివుంటుంది. మరి స్కందలో వున్న ఎమోషన్ ఏమిటి ? అది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందా? స్కందగా రామ్ ఎలాంటి విధ్వంసం సృష్టించాడు ?
ఈ సినిమాలో ప్రధాన పాత్రలకు పేర్లు వుండవు కాబట్టి.. పాత్రలు పేర్లు లేకుండానే కథ చెప్పుకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కూతుర్లని హీరో రామ్ ఎత్తుకొచ్చేస్తాడు. అలా ఎందుకు ఎత్తుకొచ్చాడనేది ఈ సినిమా కథ.
బోయపాటి తన సినిమా విషయంలో చాలా క్లారిటీగా వుంటారు. తను తీస్తున్నది కళాఖండం కాదని ఆయనకి సంపూర్ణ అవగాహన వుంటుంది. పది ఫైట్ల మధ్య ఎక్కువ ఎమోషన్, తక్కువ కథతో కొన్ని సన్నివేశాలని పొందుపరచడం ఆయన స్టయిల్. ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపొతే సినిమా చూస్తున్నంత సేపు కాలక్షేపం అయిపోతేచాలు. మాస్ మసాలా కమర్షియల్ సినిమా లెక్కలు ఇలానే వుంటాయి. ఇందులో బోయపాటికే మంచి పట్టువుంది. ఐతే స్కంద విషయానికి వచ్చేసరికి ఆ పట్టు తప్పింది.
‘రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూతుర్లని హీరో ఎత్తుకొచ్చేస్తాడు’’.. ఇలాంటి లైను ఐడియాగా అనుకున్నపుడు భలే బావుందే అనిపిస్తుంది. ఐతే దాన్ని ఆచరణలోకి పెట్టడానికి, ప్రేక్షకులకు సహజంగా చూపించడానికి చాలా నేర్పు కావాలి. కానీ ఇందులో ఆ నేర్పు కనిపించదు. ‘’మాకు నచ్చినట్లు తీశాం.. మీరు చూడాల్సిందే’ అని బలవంతం పెట్టినట్లుగా ఉంటుందేకానీ ఎక్కడా కూడా ఇందులో డ్రామా యాక్షన్ ఎమోషన్ హత్తుకునేలా వుండదు.
సినిమా నడిచిన విధానం చూసుకుంటే.. శ్రీకాంత్ పాత్రకు జరిగిన అన్యాయంతో కథ మొదలౌతుంది. న్యాయం చేయడానికి హీరో రావడం కామన్. ఐతే బోయపాటి దీనికి సక్సెస్ థ్రిల్లర్ టచ్ ఇచ్చారు. ఈ డ్రామాకి పాత్రలని సస్పెన్స్ లో పెట్టిన విధానం అస్సల్ మ్యాచ్ కాలేదు. అసలు ఎమోషన్ ఏమిటో క్లియర్ గా చెప్పకుండా నడిపినా భారీ ఎలివేషన్స్, సుధీర్గమైన పోరాట సన్నివేశాలు ఒకదశలో చిరాకు తెప్పిస్తాయి. ఇంటర్వెల్ బాంగ్ మరీ అతిగా వుంటుంది. ఒక రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, ఒక ప్రైవేట్ ఆర్మీ , వేలాది గన్స్, లక్షలాది బుల్లెట్లు పేలుతున్నా.. ఒక్క బుల్లెట్టు కూడా తాకకుండా .. ముఖ్యమంత్రి కూతురిని ఎత్తుకెళ్ళిపోతాడు హీరో. ఈ తంతు తెరపై చూసి నిట్టూర్చడం తప్పితే చేసేది ఏమీ వుండదు.
సెకండ్ హాఫ్ లో కొంచెం కథ చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అది కూడా సహజత్వానికి దూరంగానే వుంటుంది. తను అనుకుంటే పది నిమిషాల్లో దేశ ప్రధానమంత్రి తో మాట్లాడగలిగే శ్రీకాంత్ పాత్ర .. అరెస్ట్ చేస్తే సైలెంట్ గా జైల్లో కూర్చుంటుంది. అంతకుముందు రుద్రరాజవరం గ్రామంలో జరిగే పెళ్లి, పండగ హడావిడి రొటీన్. అన్నట్టు ఇందులో కూడా బోయపాటి మార్క్ మెసేజ్ వుంది. చాలా పాత మెసేజ్. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో డైనింగ్ టేబుల్ దగ్గర ఆర్తి అగర్వాల్ తో వెంకటేష్ చెప్పే త్రివిక్రమ్ డైలాగుల స్ఫూర్తితో రాసుకున్న ఈ మెసేజు చూడటానికి కాదు వినడానికి కూడా అవుట్ డేటడ్ గా వుంటుంది. ఇక ఎవరూ ఊహించని క్లైమాక్స్ తో మాస్ ని మెస్మరైజ్ చేసేయాలని బోయపాటి ఓ రహస్య అస్త్రాన్ని తీసినట్లు ఒక ఫైట్ ని డిజైన్ చేశారు. ఐతే లెజెండ్, అఖండ లో వర్క్ అయినట్లుగా ఇందులో ఆ మ్యాజిక్ వర్క్ అవుట్ కాలేదు. ఇలాంటి క్లైమాక్స్ రాసుకున్న పుణ్యానికి స్కందకి పార్ట్ 2 కూడా వుందని టైటిల్ వేయాల్సిన తప్పని పరిస్థితి వచ్చింది.
రామ్ కి మాస్ ఇమేజ్ వుందని కానీ ఇంత మాస్ ఇమేజ్ లేదు. ఒక్కసారిగా ఇంత మాస్ ని తట్టుకోవడం కొంచెం కష్టమే. యాక్షన్ సీన్స్ లో చాలా కష్టపడ్డాడు. తన పాత్రలో రెండు వేరియేషన్స్ వున్నాయి. డ్యాన్సులు కూడా బాగా చేశాడు. శ్రీలీల ది రొటీన్ పాత్ర. ఆమె నటన మరింత రొటీన్ గా వుంటుంది. డ్యాన్సులపై పెట్టిన శ్రద్ధ నటన పై కూడా పెట్టాల్సిన అవసరం ఎంతైన వుంది. చేసింది చిన్న పాత్ర అయినా సాయి మంజ్రేకర్ కొంచెం నయం. ఆమె కళ్ళలో కొన్ని భావాలు పలికాయి. ప్రిన్స్ విలన్ గా కనిపించాడు. ముఖ్యమంత్రులుగా చేసిన నటులు చివర్లో వీధి రౌడీలకంటే దారుణమైన బాడీ లాగ్వెంజ్ చూపించారు. శ్రీకాంత్ హుందా కనిపించారు. తెరపైనిండా ఆర్టిస్టులు కనిపిస్తారు కానీ ఎవరిపాత్ర గుర్తుపెట్టుకునేలా వుండదు.
తమన్ పాటల్లో గండర బాయి తప్పితే వినబుల్ గా అనిపించే పాట లేదు. ఆ పాటలో డ్యాన్సులు బాగా కుదిరాయి. కల్ట్ పాటలో ఆ మాట తప్పితే మరో పదం వినిపించకుండా జాగ్రత్తపడ్డారు. నేపధ్య సంగీతంలో కొత్తదనం లేదు. భారీ శబ్దాలు తప్పితే రిజిస్టర్ అయ్యే ఒక్క బీజీయం కూడా వుండదు. కెమరాపని కమర్షియల్ సినిమాకి సరిపోయింది. ఇంత సాగదీత వున్న ఫైట్లు వద్దని దర్శకుడిని ఎడిటర్ ఏదోలా ఒప్పించాల్సింది. భారీగానే ఖర్చు చేశారు. అది తెరపై కనిపించింది. బోయపాటి రాసిన మాటల్లో మెరపులు లేవు. ఆయనికి డైరెక్టర్ గా కంటే యాక్షన్ సూపర్ వైజర్ గా ఎక్కువ మార్కులు పడతాయి. బోయపాటికి బాలయ్యతో కుదిరినంతగా మరొకరితో కుదరదని ‘స్కంద’ మళ్ళీ రుజువుచేసింది.
తెలుగు360 రేటింగ్ : 2.5/5