కూకట్ పల్లి ఎమ్మెల్యేగా అధికారం రుచి మరిగిన జేపీకి.. మరోసారి అలాంటి హోదా కుదిరితే ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ అందుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఎటు వైపు అవకాశం వస్తే అటు వైపు మొగ్గేందుకు విలువల్ని వలువలు చేసి వదిలేస్తున్నారు. చిన్నా చితకా యూట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ప్రభుత్వాల తప్పుడు పనులకు అడ్డగోలు సమర్థనలు ఇచ్చేస్తున్నారు. కొత్తగా కాంగ్రెస్ పై నిందలేసేందుకు.. బీఆర్ఎస్ పార్టీని పొగిడేందుకు ఏకంగా కేటీఆర్ తో ఓ ఇంటర్యూ చేసేశారు. టీవీ9లో ప్రసారం అయిన ఆ ఇంటర్యూ.. ఇప్పుడు జేపీని ఆయనను అభిమానించే వారి దగ్గరా చులకన చేసేసింది.
అసెంబ్లీలో అప్పటి టీఆర్ఎస్ నేతలు కొట్టింది గుర్తు లేదా !?
టీవీ9లో జేపీ, కేటీఆర్ ఇంటర్యూ ప్రోమో రాగానే అందరూ ఆశ్చర్యపోయారు. తెలంగాణ ఉద్యమం సమయంలో.. మేధావి.. పెద్ద మనిషి.. మాజీ ఐఎస్.. ఎవరినీ కోపంగా కూడా చూడడు..లాంటి లక్షణాలన్నీ పెట్టుకున్నప్పటికీ..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. చివరికి ఈటల రాజేందర్ డ్రైవర్ చేతిలో తన్నులు తిన్నారు. ఆ ఘటన ఆయనకు పరువు తక్కువ అనిపించిందో లేదో కానీ.. బీఆర్ఎస్ తో ఆయన అసోసియేట్ అని ప్రతీ సారి తెరపైకి వస్తూనే ఉంది. ఆయన విలువల్ని ప్రశ్నార్థకం చేస్తూనే ఉంది.
సొంత పార్టీ నుంచి గెంటించేసుకుని ఎందుకీ రాజకీయాలు ?
జేపీ మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన చెప్పే ఆదర్శాలు అర్థం కాక.. చాలా మంది గొప్ప మేధావి అనుకునేవారు. అర్థం కాని మాటలు చెప్పేవారే అప్పట్లో మేధావిగా చెలామణి అయ్యేవారు. లోక్ సత్తా అనే సంస్థను పెట్టి.. ప్రజలకు ఏదో చేశానని భ్రమ కల్పించి .. రాజకీయ పార్టీ పెట్టారు. ఆ రాజకీయ పార్టీతో ఓ రాష్ట్ర భవిష్యత్ న నాశనం చేశారనే అపవాదు మూటగట్టుకున్నారు. వైఎస్ఆర్ కుట్రలో భాగంగానే ఆయన ఆర్థిక సాయంతోనే లోక్ సత్తా పోటీ చేసిందని ఎక్కువ మంది నమ్ముతారు. తర్వాత ఆ మాదిరి పార్టీ కూడా నడపలేక…అందరూ కలిసి ఆయనను గెంటేశారు. ఇప్పుడు లోక్ సత్తా ఉంది. కానీ జేపీది కాదు.
ఏదో ఓ పదవి కోసం అందర్నీ జోకడం అవసరమా ?
ఎంపీ లేదా ఎమ్మెల్యే అవ్వాలని తన మేధావి తత్వాన్ని చూసి… పిలిచి రెడ్ కార్పెట్ వేస్తారని అనుకున్నారు. అందుకే బీజేపీని ఇష్టం వచ్చినట్లుగా పొగిడారు. మోడీ సర్కార్ తీసుకునే అడ్డగోలు నిర్ణయాలను అహో ఓహో అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కోసం… కాంగ్రెస్ పై నిందలేశారు. బీఆర్ఎస్ పై ఆహా.. ఓహో అన్నారు. మొన్న జగన్ రెడ్డితో కలిసి ఓ కార్యక్రమంలో కూర్చుని చిరునవ్వులు చిందించారు. జగన్ రెడ్డి చేస్తున్న పనికి మాలిన పనులపై ఎప్పుడూ విమర్శలు చేయలేదు కానీ.. ఆయన ఏదైనా మంచి పని చేస్తాను అని ప్రకటన చేయగానే.. డబ్బా ఎత్తుకుని కొట్టేయడానికి రెడీగా వచ్చేస్తున్నారు.
ఏ మాత్రం విలువలేని ఈ మేధావితనం ఎందుకు ?
జేపీని ఒకప్పుడు మేధావిలాగా చూసేవారు. ఇప్పుడు మేదావి కాదు.. ఏదో ఓ పదవి కోసం.. చిల్లర కోసం యూట్యూబ్ చానళ్లలో ఎవరు డబ్బులు ఇస్తే వారి కోసం మాట్లాడే సాదాసీదా వ్యక్తిగా చూాస్తున్నారు. ఆ స్థాయికి జేపీ దిగిపోయారు. ఇప్పటికైనా గౌరవాన్ని కాపాడుకుంటారో … ఆర్జీవీ లాగా… తాను దిగజారిపోవడానికి ప్రత్యేకమైన హద్దులేమీ లేవని అనుకుంటారో… ఆయనే డిసైడ్ చేసుకోవాల్సిఉంది.