తెలంగాణలో జనసేన పార్టీ పోటీ వద్దని బీజేపీకి స్వచ్చంద మద్దతు ప్రకటించాలని .. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌పై బీజేపీ తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కిషన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, పవన్ కల్యాణ్ ఢిల్లీలో అమిత్ షాతో అరగంటకుపైగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా పరోక్షంగా… జనసేన పార్టీ మద్దతు గురించి మాట్లాడారు కానీ.. కలిసి పోటీ చేయడం గురించి మాట్లాడలేదని చెబుతున్నారు.
జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు.. అనే అంశంపై అమిత్ షా అసలు మాట్లాడలేదని చెబుతున్నారు. కిషన్ రెడ్డి కూడా ఏ సీట్లిస్తారన్న అన్న విషయం చెప్పడం లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఒత్తిడి చేయించడం ద్వారా గ్రేటర్ ఎన్నికల్లోలా పవన్ కల్యాణ్ పోటీ చేయకుండా ప్రచారం చేయించుకునే ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అయితే పవన్ కల్యాణ్.. బీజేపీకి ఈ విషయంలో ఎలాంటి చాయిస్ ఇవ్వకూడదన్న లక్ష్యంతో ఉన్నారు.
పోటీ చేయకూడదన్న మాటే్ రాదని.. పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు. అందుకే.. కనీసం ఇరవై స్థానాల్లో అయినా అభ్యర్థులను నిలబెడతామని.. పొత్తు కావాలంటే స్థానాలు కేటాయించాల్సిందేనని సంకేతాలు పంపుతున్నారు. దీనిపై బీజేపీ ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. బీజేపీ ఉనికి లేని ఖమ్మం, నల్లగొండ వంటి చోట్ల సీట్లిచ్చేందుకు సిద్ధమవుతున్నా.. జనసేన మాత్రం.. తాము పోటీ చేస్తామని ప్రకటించిన 32 నియోజకవర్గాల నుంచే కేటాయించాలని డిమాండ్ చేస్తోంది.
బీజేపీ రెండో జాబితా ఒకటో తేదీ తర్వాతే రానుంది. అప్పటికి కొత్తగా ఎవరైనా వస్తే చేర్చుకుంటారు. జనసేనకు సీట్లివ్వాలా లేదా అన్నది అప్పుడు డిసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం బీజేపీ టార్గెట్.. జనసేనపై ఒత్తిడ చేసి అయినా పోటీ నుంచి తప్పించడమే .