తెలంగాణ బీజేపీ పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. పార్టీలోకి వెల్లువలా చేరికలు ఉంటాయని మూడేళ్లుగా చెబుతూ వస్తున్నారు. కానీ ఎన్నికలకు ముందు ఉన్న వాళ్లు కూడా దండం పెట్టేస్తున్నారు. కొత్తగా చేరే వారే లేరు. ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించి.. బీజేపీ రేసులో ఉందని చెప్పి ఏడాదిన్నర కిందట కొంత మందిని పార్టీలో చేర్చుకున్నారు. అందులో ఎవరూ ఇప్పుడు బీజేపీలో లేరు.
స్వామిగౌడ్, ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, రాపోలు ఆనందభాస్కర్, మాజీ మంత్రి చంద్రశేఖర్, ఎర్రశేఖర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, పుష్పలీల, నాగం జనార్ధన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి అంతా కమలంతో తమకు సరిపడదని చెప్పి.. సెలవు తీసుకున్నారు. కాంగ్రెస్ వర్సెన్ టీఆర్ఎస్ అనే మూడ్ ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఐదారు నెలల కింద ఉత్సాహంగా ఉన్న నేతలకు ఇప్పుడు గాడి ఆడటం లేదు. ఘోరంగా ఓడిపోతే ఉన్న పరువు కాస్తా ఎక్కడ పోతుందో అనే భయంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికే పార్టీ మారిపోలేని సీనియర్లు జంకుతున్నారు. డీకే అరుణ, వివేక్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి పోటీకి దూరంగా ఉంటున్నారు. వీరందరిపై తరచూ పార్టీ మార్పు ప్రచారం జరుగుతూనే ఉంది.
ఈటల రాజేందర్ కూడా డైలమాలో ఉన్నారు. ఆయనకు గజ్వేల్ తో పాటు హుజూరాబాద్ టిక్కెట్ ఇచ్చారు. కానీ ఆయనను నమ్ముకుని పార్టీలోకి వచ్చిన వారికి హ్యాండిస్తున్నారు.వేములవాడ టిక్కె్ట కోసం తుల ఉమ బీజేపీలోకి వచ్చారు. కానీ ఇప్పుడు చెన్నమనేని విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావు కు ఇస్తున్నారు. దీంతో ఈటల రగిలిపోతున్నారు. ఈ అసంతృప్తి ఎక్కడకు చేరుతుందో ఎవరికీ అర్థం కావడ లేదు. ఇతర పార్టీల్లో టిక్కెట్లు ఖరారు చేస్తున్నా ఎవరూ చేరకపోవడంతో… రెండో జాబితాను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ పోతున్నారు.