ఆంధ్రప్రదేశ్లో మద్యం విధానం పేరుతో జరిగింది ఘోరమైన దోపిడీ. మద్యం విధానం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని చీప్ లిక్కర్ ను అత్యంత ఎక్కువ ధరలకు అమ్ముతూ ప్రజల్ని నిలువు దోపిడీ చేశారు. ఏటా పాతిక, ముఫ్పై వేల కోట్లు ప్రజల నుంచి పిండేశారు. వారి ఆరోగ్యాల్ని నాశనం చేశారు. దీనికి సంబంధించి ప్రతీ ఆధారం కళ్ల ముందు ఉంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఒక్క పాత బ్రాండ్ అమ్మకానికి లేదు. అన్నీ వైసీపీ నేతల డిస్టిలరీల్లో తయారయ్యే ఊరూపేరూ లేని మద్యాన్ని అమ్మారు. టార్గెట్లు పెట్టి మరీ అమ్మించారు. వాటిలో విష రసాయనాలు ఉన్నాయని నివేదికలు వచ్చినా పట్టించుకోలేదు. నగదు లావాదేవీలు మాత్రమే జరిపారు. మద్యం దుకాణాల్లో వైసీపీ నేతలు మాత్రమే ఉన్నారు. మద్యం తయారీ , రవాణా, అమ్మకాలు మొత్తం వైసీపీ గుప్పిట్లో ఉన్నాయి. మద్యం ఎవరు తయారు చేశారు..ఎవరి గుప్పిట్లో తయారీ ఉంది.. వంటి వివరాలన్నీ బయటకు వచ్చాయి. స్వయంగా ఏపీ బీజేపీ చీఫ్ కూడా బయట పెట్టారు.
ఇప్పటికే కేంద్రానికి లెక్క లేనన్ని ఫిర్యాదులు అందాయి. ఆధారాలతో సహా టీడీపీ ఫిర్యాదు చేసింది. రఘురామ స్వయంగా ల్యాబుల్లో మద్యాన్ని టెస్టులు చేయించి రిపోర్టులు కేంద్రానికి సమర్పించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఫిర్యాదు చేశారు. గతంలో ప్రముఖ మద్యం కంపెనీలు కూడా .. కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. అయితే ఆ ఫిర్యాదులన్నింటినీ కేంద్రం తొక్కి పెట్టింది. వేల కోట్ల స్కాం జరుగుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోంది. ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నా లెక్క చేయడం లేదు.
కానీ ఆరోపణలు తీవ్రమవుతున్న సమయంలో ఇప్పుడు విచారణ చేయాలనే డిమాండ్లు సొంత పార్టీ నుంచి పెరుగుతున్నాయి. పురందేశ్వరికి ఈ అంశంపై పోరాడే విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టకపోతే.. విచారణ చేయించే ఉద్దేశం కూడా కంద్రానికి ఉందేమోనన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల తర్వాత అయినా ఏపీ మద్యం స్కాంపై విచారణ జరిపితే అవినీతి ఆనకొండలు బయటకు వస్తాయి.