చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో సీఐడీ అధికారులు కుట్ర చేశారని వారి కాల్ రికార్డులను భద్రపరచాలని చంద్రబాబు తరపు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ పై సీఐడీ అధికారుల కంగారు చాలా ఎక్కువగా ఉంది. తాము అంతా చట్టబద్దంగాచేస్తే.. తమ కాల్ రికార్డులు భద్రపరచడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాల్సింది కానీ కోర్టుకు మాత్రం.. సీఐడీ అధికారుల నైతిక స్థైర్యం.. వారి ధైర్యం.. వారి నమ్మకం.. వారి భద్రత అంటూ.. అఫిడవిట్ దాఖలు చేశారు. అరెస్ట్ సమయంలో అనేకమందితో మాట్లాడాల్సి ఉంటుందని అలాగే మాట్లాడి ఉంటారని.. ఆ వివరాలు బయటకు వస్తే ధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని సీఐడీ తరఫు న్యాయవాదులు కౌంటర్లో వివరించారు.
అంతేకాదు.. అధికారుల భద్రతకు నష్టం ఉంటుందని కూడా సీఐడీ పేర్కొంది. గురువారం నాడు సుమారు రెండు గంటల పాటు విచారణ జరగ్గా అనంతరం శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. ఆ కాల్ డేటాను బహిర్గతం చేయమని చంద్రబాబు తరపు లాయర్లు అడగడం లేదు. ధ్వంసం చేయకుండా.. కోర్టుకు సబ్ మిట్ చేయాలని మాత్రమే అడుగుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అంతా.. ఓ కుట్ర ప్రకారం.. కొన్ని వ్యవస్థల్ని సైతం మేనేజ్ చేస్తూ జరిగిందని టీడీపీ అనుమానిస్తోంది. చంద్రబాబును అరెస్ట్ చేయడంలో కుట్ర ఉందని.. కనీసం ఎఫ్ఐఆర్ లో కూడా పేరు లేకుండా అరెస్టు చేశారని.. అందుకే ఆ కుట్ర గురించి బయటకు రావాలంటే కాల్ డేటా భద్రపరచాలని చంద్రబాబు తరపు లాయర్లు వాదిస్తున్నారు.
మొత్తంగా ఈ కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చే నిర్ణయం కీలకం కానుంది. ఒక వేళ సీఐడీకి అనుకూలంగా తీర్పు వస్తే కాల్ రికార్డులు తొలగించాలని టెలికాం కంపెనీలను సీఐడీ కోరే అవకాశం ఉంది. అంటే సాక్ష్యాలు లేకుండా చేసుకుంటారు. ఒక వేళ కాల్ రికార్డు భద్రపరచాలని ఆదేశిస్తే.. అవి కోర్టు దగ్గర ఉంటాయి. తదుపరి విచారణలో కీలకమయ్యే అవకాశం ఉంటుంది.