బీజేపీ జాతీయ నాయకత్వం శుక్రవారం రెండో జాబితాను వెల్లడించింది. ఆ జాబితాలో కేవలం ఒకే ఒక్క పేరు ఉండటం అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఆ పేరూ ఆ పార్టీలో చిచ్చుపెట్టింది. మొదటి నుంచీ మహబూబ్‌నగర్ సీటు తనకు కేటాయించాలని డీకే అరుణ పట్టుబడుతూ వస్తున్నారు. అదే సమయంలో ఆ సీటు కోసం మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కూడా ఒత్తిడి చేస్తున్నారు. తన కొడుకు కోసం గట్టి ప్రయత్నాలు చేసి సఫలం అయ్యారు. అందులో భాగంగానే ఆ సీటును జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డికి కేటాయించింది.
అప్పటికప్పుడు ఒక్క పేరుతో ప్రకటన చేశారు. కేటాయించకపోతే తండ్రీకొడుకులు పార్టీ మారుతారనే భయంతోనే ఆ సీటు కేటాయించారు. ఈ కేటాయింపుపై డీకే అరుణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యనేతలు రంగంలోకి దిగి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె పార్టీ మారుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయినా ఆమెను మరింత కించపరిచేలా ఆ ఒక్క పేరు ప్రకటన చేయడం చర్చకు కారణం అవుతోంది.
బీజేపీ నుంచి వరుసగా కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. ఈటలతో పాటు బీజేపీలో చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ కూడా పార్టీకి బైబై చెప్పేశారు. కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ రెండో లిస్టుపై ఆధారపడి బీజేపీ అభ్యర్థుల కోసం ఎదురు చూస్తోంది. హస్తం పార్టీలో సీటు దక్కని అసంతృప్త నేతలు తమవైపు వస్తారని ఆశతో ఎదురుచూస్తున్నది. అయితే, అది కూడా నెరవేరేటట్లు కనిపించడం లేదు. ఉన్న వాళ్లే జారిపోతున్నారు.