జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తెలంగాణలో బీజేపీ నిర్వహించిన పొత్తు చర్చలు కేవలం ఆయనను కన్ఫ్యూజ్ చేయడానికేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ తో ఓ సారి కిషన్ రెడ్డి లక్ష్మణ్ సమావేశం అయ్యారు. తర్వాత ఆయనను తీసుకుని ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో అరగంట పాటు సమావేశం అయ్యారు. కానీ పవన్ కు పొత్తుల్లో ఇచ్చే సీట్ల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కనీసం తదుపరి చర్చల కోసం ఏదైనా ఓ ప్రక్రియ ఉంటుందా అన్నది కూడా చెప్పలేదు.
నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి కోసం కొణిదెల కుటుంబం అంతా ఇటలీ వెళ్లింది. పవన్ కల్యాణ్ కూడా వెళ్లారు. ఆయన కుటుంబ కార్యక్రమం కోసం విదేశాలకు వెళ్తున్నారని తెలిసిన తర్వాత కూడా బీజేపీ నేతలు ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. దీంతో పొత్తుల విషయంలో బీజేపీ సీరియస్ గా లేదని.. కేవలం పవన్ కల్యాణ్ గందరగోళానికి గురి చేయడానికే కొత్తగా చర్చల పేరుతో టైంపాస్ చేస్తున్నారన్న అనుమానాలు జనసేనలో వ్యక్తమవుతున్నాయి.
జనసేన 32 స్థానాల్లో పోటీ చే్యాలని అనుకుంది. ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ ఇప్పటికే పేర్లు కూడా రెడీ చేసుకున్నారు. కానీ బీజేపీ చర్చల పేరుతో పిలిచి.. అసలు ఇచ్చే స్థానాల గురించి చెప్పకుండా.. ఐదు నుంచి పన్నెండు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. మరో వైపు తమ పార్టీ పొత్తులు ఏపీలో ప్రభావం చూపకూడదని పవన్ కూడా అనుకుంటున్నారు. అసలు బీజేపీతో కలిసి పోటీ చేయాలని పవన్ ఎప్పుడూ అనుకోలేదు. కానీ హఠాత్తుగా బీజేపీ నేతలే పవన్ పై ఒత్తిడి ప్రారంభించారు.
బీజేపీ అసలైన రాజకీయాలు చేయకుండా.. మిత్రపక్షాలను సైతం..తప్పుడు పద్దతిలో డీల్ చేస్తోందన్న విమర్శలు చాలా కాలంగా ఎదుర్కొంటోంది. ఇప్పుడు జనసేన విషయంలోనూ అదే చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.