ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం రాజకీయాల కక్ష సాధింపులతో భాగం అయిన న్యాయవ్యవస్థపై , తీవ్రమైన క్రిమినల్ కేసులతో ఉన్న వారి చేతుల్లో మేనేజ్ అవుతున్న వైనంపై సూటిగానే కొత్తపలుకులో ప్రశ్నించారు. ఒక్క చంద్రబాబు కేసు కాదు.. జగన్ రెడ్డి కేసుల్లో ఎందుకు విచారణలు చేయలేకపోతున్నారు….. ఆయనకు సంబంధించిన వారు హత్యలాంటి తీవ్రమైన కేసుల్లో ఉన్నా ఎందుకు అరెస్టులు చేయలేకపోతున్నారని అదే సమయంలో ఆయన వ్యతిరేకుల్ని ఏ సాక్ష్యాలు లేకుండా… కేవలం కక్ష సాధింపుల కోసం అరెస్టు చేసినట్లుగా కనిపిస్తున్నా ఎందుకు న్యాయస్థానాలు కళ్లు మూసుకుకుంటున్నాయని ఆయన సూటిగానే ప్రశ్నించారు.
చంద్రబాబు విషయంలో యాభై రోజులుగా పిటిషన్లు విచారణకు రావడం లేదు. ఏదో ఓ సాకు చెప్పి వాయిదా వేస్తున్నారు. కనీస ఆధారాలు లేకుండా దిగువ కోర్టు న్యాయాధికారి చంద్రబాబుకు రిమాండ్ విధించారు. అలాగే.. ఢిల్లీలో మనీష్ సిసోడియా కేసులో… ఐదు నిమిషాల్లో కొట్టివేతకు గురయ్యే కేసు అని న్యాయమూర్తి వ్యాఖ్యానించినా.. బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేశారు కానీ నిర్ణయం ప్రకటించలేదు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పటికీ క్వాష్ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపి… తీర్పు వాయిదా వేశారు. తీర్పు ఎప్పుడొస్తుందో తెలియదు. చంద్రబాబు ఆరోగ్య కారణాలతో పెట్టుకున్న పిటిషన్లను కూడా కోర్టులు పరిశీలించడం లేదు. ఇదెక్కడి న్యాయమని ఆర్కే ప్రశ్నించారు.
ఏ లాయర్ దగ్గరకు వెళ్తే న్యాయం జరుగుతుందో… ఆ లాయర్ ఏ జడ్జికి సన్నిహితుడో తెలుసుకుని ఇప్పుడు కక్షి దారులు అక్కడకు వెళ్తున్నారని.. బెంచ్ పై ఏ జడ్జి ఉంటే ఎలాంటి తీర్పు వస్తుందో ముందే ఊహిస్తున్నారని ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ పై ప్రజలుఇప్పటికీ నమ్మకం ఉంచుకుంటున్నారని దీన్ని కాపాడుకోలేకపోతున్నారన్నారు. న్యాయవ్యవస్థపై ఆర్కే వ్యక్తం చేసిన అభిప్రాయాలు సామాన్యుల మనసుల్లో ఉన్నవే.
తప్పుడు తీర్పులు ఇచ్చే న్యాయధికారులు, న్యాయమూర్తులపై చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఇలాంటి జవాబుదారీ తనం లేకపోవడం వల్లనే… వ్యవస్థలోని కొంత మంది దారి తప్పుతున్నారని ఆర్కే అంటున్నారు. నిజంగానే చట్టం, న్యాయం అనే దాన్ని బట్టి తీర్పులు వస్తాయో… న్యాయమూర్తులు తమ ఇష్టం వచ్చినట్లుగా తీర్పులు ఇస్తారో తెలియక చాలా మంది సామాన్యులు ఇప్పటికే న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయారు. ఇటీవలి కాలంలో అమరావతి రైతుల కౌలు పిటిషన్లపైనా , ప్రభుత్వం డబ్బులు ఎగ్గొడుతోందని దాఖలవుతున్న పిటిషన్లపైనా కోర్టులు చురుగ్గా స్పందించకపోవడంతో… ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
ఆర్కే వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ సామాన్యుల మనసుల్లో ఉన్నవే. అందుకే సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.