రాజకీయాల్లో ఓడించాలి కానీ చంపాలనుకోకూడదు. అలా అనుకుంటే అది రాజకీయం కాదు. కానీ ఏపీలో అదే జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో రాజకీయం అంటే ఘోరంగా తిట్టుకోవడం.. కొట్టుకోవడం.. చంపుకోవడం అన్నట్లుగా మారిపోయింది. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం, కుటుంబాలను కించ పర్చుకోవడం దగ్గర్నుంచి ఇప్పుడు చావులు, మరణాలు ప్రకటనల వరకూ వచ్చాయి. ఇవి సంచలనంగా మారుతున్నాయి. జగన్ రెడ్డి గెలవగానే చంద్రబాబు జైల్లోనే చస్తాడని ఎంపీ మాధవ్ చేసిన వ్యాఖ్యలు వికృత రూపానికి పరాకాష్టగా మారాయి.
రాజకీయాలు రాజకీయాలే.. వ్యక్తిగత సంబంధాలు వ్యక్తిగత సంబంధాలే అని అనుకువేవారు. చాలా రాష్ట్రాల్లో అలాగే ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం రాజకయాలు.. వ్యక్తిగత సంబంధాలు వేర్వేరు కాదు. రాజకీయ ప్రత్యర్థులు … పొలిటికల్ గేమ్ లో పోటీపడే వారు మాత్రమే కాదు.. వ్యక్తిగత శత్రువులు కూడా. రాజకీయంగా విబేధిస్తే.. వారిపై ఎలాంటి భాషతో విరుచుకుపడతారో చెప్పడం కష్టం.దాడులు కూడా కామన్ అయిపోయాయి. ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత అసెంబ్లీలో తనపై.. తన కుటుంబంబపై చేసిన వ్యాఖ్యలతో కన్నీరు పెట్టుకున్నారు. ఆయనపై ఆ దాడి తగ్గడం లేదు. వరుసగా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రాణాలు గురించి చావడం గురించి మాట్లాడుతున్నారు
అధికారంలో ఉన్న పార్టీ బాధ్యతాయుతంగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. అధికారం చేతిలో ఉంది కదా అని చంపేస్తామని బెదిరిస్తే.. అది ప్రజల్లో నెగెటివ్ గా వెళ్తుంది. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తాము దుర్వినియోగం చేయలేదని.. పద్దతిగా పరిపాలించామని ప్రజలకు జవాబుదారీగా ఉండి ఓట్లు అడగాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో వైసీపీ నేతలు గీత దాటి చేసే ప్రకటనల వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయి. అధికార పార్టీ ఇదే కోరుకుంటుందేమో కానీ.. ఏపీలో ఎప్పుడెవరు ప్రాణాలతో ఉంటారో చెప్పడం కష్టంగా మారింది.