తెలంగాణ బీజేపీకి ఏదీ కలసి రావడం లేదు. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల్లో అసంతృప్తి నేతలు ప్రతి చిన్న పార్టీలోకి చేరిపోవడానికి ప్రయత్నిస్తారు. ఏదో ఓ పార్టీ తరపున పోటీ చేస్తారు. అలాంటి వారికీ తెలంగాణ బీజేపీ చాయిస్ కావడం లేదు. పైగా ఉన్న వారు వెళ్లిపోతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ చర్చలు జరిపారు. తమ మధ్య చర్చలు జరిగాయని ఫోటో కూడా లీక్ చేశారు. దీంతో వివేక్ కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమయిందన్న ప్రచారం జరుగుతోంది.
వివేకా సోదరుడు వినోద్ ఇప్పటికే కాంగ్రెస్ తరపున బెల్లంపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని వివేక్ వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన రేవంత్ రెడ్డి ఆయనతో దాదాపు గంటన్నరపాటు చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ ఆహ్వానించినట్లు తెలిసింది. కొంత కాలంగా బీజేపీ కార్యక్రమాలకు వివేక్ వెంకట స్వామి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వివేక్ కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారమూ జరిగింది. ఈ ఊహాగానాలకు ఈ భేటీతో బలం చేకూరింది.
ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా, వివేక్ వెంకటస్వామి కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరితే బీజేపీకి మరింత దెబ్బ. నిజానికి వేవేక్ తండ్రి వెంకటస్వామి కరుడు గట్టిన కాంగ్రెస్ వాది. ఆయన చనిపోయేవరకూ కాంగ్రెస్ లోనే ఉన్నారు. కానీ ఆయన కుమారులు ఇద్దరు మాత్రం రాజకీయంగా అటూ ఇటూ మారుతూనే ఉన్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరితే ఇది మూడో సారి చేరడం అవుతుంది.