తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. ఏడాదిన్నర కిందట తెలంగాణలో మళ్లీ పూర్వ వైభవం కోసం ఖమ్మంలో అందరూ ఆశ్చర్యపోయేలా సభ నిర్వహించి తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లోనూ సత్తా చూపిించిన టీడీపీ.. ఇక జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణం కూడా చేపట్టింది. కొన్ని చేరికలు కూడా జరిగాయి. పాత టీడీపీ నేతలంతా మళ్లీ తిరిగి వస్తారని అనుకుంటున్న సమయంలో… చంద్రబాబు అరెస్టుతో ఒక్క సారిగా పరిస్థితి తిరిగబడినట్లయింది.
ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు బయటకు రాకుండా చేస్తున్నారని… తెలంగాణ ఎన్నికల కోసమే టీడీపీ పై కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న సమయంలో… పోటీపై సందిగ్ధత నెలకొంది. నిజానికి చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత తెలంగాణ టీడీపీ బాధ్యతల్ని బాలకృష్ణ తీసుకునేందుకు ముందుకు వచ్చారు. తాను తెలంగాణ అంతా తిరిగి ప్రచారం చేస్తానని ప్రకటించారు. కానీ ఏమైందో కానీ తర్వాత బాలకృష్ణ కూడా పట్టించుకోలేదు.
ఇప్పుడు… టీడీపీ పోటీకి దూరంగా ఉండాలని ములాఖత్‌లో చంద్రబాబు సూచించారని చెబుతున్నారు. ఈ అంశంపై పోటీకి సిద్ధమైన టీడీపీ నేతలు ఏం చెబుతారో కానీ.. టీడీపీ పోటీచేయకపోవడం వల్ల ఎవరికి లాభమనే అంశంపై భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. సెటిలర్లు మొదటి నుంచి బీఆర్ఎస్కు మద్దతుగా ఉన్నారు కాబట్టి ఓట్లు చీలవని.. ఆ పార్టీకే మద్దతుగా ఉంటారని అంటున్నారు. ఈ సారి కాంగ్రెస్ వైపు మొగ్గుతారని మరికొంత మంది అంటున్నారు. అయితే ఏ కోణంలో చూసినా బీజేపీకి టీడీపీ పోటీకి దూరంగా ఉండటం వల్ల మేలు జరిగే అవకాశం లేదన్న విశ్లేషణ మాత్రం వినిపిస్తోంది.