ఏపీలో వైరల్ వీడియోలపైనే కేసులు పెడుతున్నారు. ఆ వైరల్ వీడియోల్లో వైసీపీ నేతలుంటే అతి కష్ట మీద ఆలస్యం చేసి కేసులు పెడుతున్నారు. ఎప్పటికి అరెస్టు చేస్తారో.. అరెస్టు చేసినా వెంటనే విడుదల చేస్తారో వారికే తెలియదు. తాజాగా కావలిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటనలో వైసీపీ కార్పొరేటర్ ఉన్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు ఆయన జోలికి వెళ్లలేదు. ఇతరుల పేర్లతో కేసు పెట్టేసి…. కొంత మందిని అరెస్టు చూపించారు. మరికొంత మంది దొరకలేదంటున్నారు.
కావలిలో ఆర్టీసీ ఉద్యోగిపై జరిగిన అరాచక దాడి దేశం మొత్తం వైరల్ అయింది. అత్యంత దారుణంగా .. తమ జోలికి ఎవరూ రారన్న ధైర్యంతో నిందితులు తెగబడిన వైనం చూస్తే… వారెవరికీ చట్టం అన్నా.. పోలీసులు అన్నా కనీస భయం లేదని స్పష్టమవుతోంది. దానికి తగ్గట్లుగానే పోలీసుల తీరు ఉంది. వీడియో వైరల్ అయ్యే వరకూ పట్టించుకోలేదు. తీవ్రమైన విమర్శలు రావడంతో ఓ రెడ్డి, మరో ఆరుగురు ముస్లింలపై కేసులు పెట్టారు. కార్పొరేటర్ పేరు మాత్రం నమోదు చేయలేదు. బాధితుడు… తనపై దాడి చేసిన వారిలో వైసీపీ కార్పొరేటర్ ఉన్నాడని చెబుతున్నారు.
ఇటీవల వైసీపీ నేతల దౌర్జన్యాల వీడియోలు విరివిగా వెలుగులోకి వస్తున్నాయి. వైరల్ అయితే తర్వాత తప్పనిసరిగా అన్నట్లుగా కేసులు పెడుతున్నారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి మానవహక్కులు ఉల్లంఘించిన ఘటనలో… స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు. పైగా పుంగనూరు ఇమేజ్ చెడగొట్టాడానికి వీడియోలు వైరల్ చేస్తున్నారని ఎస్సీ రిషాంత్ రెడ్డి నిందితుల్ని వెనకేసుకు వచ్చారు. ఇలాంటి క్రైమ్స్ రాను రాను పెరుగుతున్నాయి. వీడియోలు ఎవరైనా తీసి.. వైరల్ అయితే నిందితులపై కేసులు పడుతున్నాయి. వీడియో లేని ఇంకెన్ని నేరాలు జరుగుతున్నాయో… అంచనా వేయడం కష్టమే.