తెలంగాణ బీజేపీ మూడో జాబితా విడుదల చేసింది. ఇందులో 35 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన వారందరికీ టిక్కెట్లు కేటాయించారు. కానీ ఈ జాబితా చూస్తే.. జనసేన పార్టీకి ఇవ్వాల్సిన సీట్లపై సొంత పార్టీలోనే సెగ ఉందని స్పష్టమైంది. గ్రేటర్ పరిధిలో టిక్కెట్లను ప్రకటించడానికి తంటాలు పడుతున్నారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి టిక్కెట్లను జనసేనకు ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఆ సీట్లను జనసేనకు ఇస్తే తన దారి తాను చూసుకుంటానని.. మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తేల్చేశారు.
అలాగే జనసేనకు కేటాయించాల్సిన అన్ని సీట్ల విషయంలోనూ పేచీలు ఉన్నాయి. దీంతో జాబితా ప్రకటించలేదు. తాజాగా ప్రకటించిన 35 మంది జాబితాలో మూడో జాబితాలో తన పేరు ఉన్నా కూడా పోటీ చేయనని ప్రకటించిన సినీ నటుడు బాబూమోహన్ పేరు కూడా ఉంది. తనను అవమనించారని ఆయన మూడు రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి ఆరపించారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎప్పుడూ పోటీ చేసే నియోజకవర్గం అంబర్ పేట నుంచి ఈ సారి ఆయన పోటీ చేయడం లేదు. మాజీ మంత్రి క్రిష్ణాయాదవ్ కు టిక్కెట్ ఇచ్చారు. మర్రి శశిధర్ రెడ్డి కి సనత్ నగర్ టిక్కెట్ కేటాయించారు. ఈ జాబితాలో పలువురు ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన వారు ఉన్నారు. మాజీ జర్నలిస్టు సంగప్పకు.. నారాయణఖేడ్ నుంచి టిక్కెట్ కేటాయించారు.
పలువురు సీనియర్లు పోటీకి వెనుకాడుతూండటంతో.. అభ్యర్థులను ఖరారు చేయడం బీజేపీ పెద్దలకు సమస్యగా మారింది. మొదటి జాబితాలో 52, రెండో జాబితాలో ఒక్క పేరు మాత్రమే విడుదల చేశారు. ఇప్పుడు మరో 35 పేర్లను ఖరారు చేశారు. మొత్తంగా 88 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. ఇంకా 31 సీట్లకు పెండింగ్ ఉన్నాయి. వీటిలోనే జనసేనకు సర్దుబాటు చేయాల్సి ఉంది.