అధికారంలో ఉన్న పార్టీలు క్విడ్ ప్రో కో ద్వారా కార్పొరేట్ సంస్థలకు మేలు చేసి వాటి దగ్గర నుంచి లంచం రూపంలో పార్టీ ఫండ్ తీసుకుంటున్నాయి. ఇది నేరం కాదు. చట్టబద్దమైన పనిగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రదాని మోదీ ప్రభుత్వం తేల్చింది. ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో ఓ చట్టం తీసుకు వచ్చింది. ఈ బాండ్స్ ఎవరైనా కొని రాజకీయ పార్టీలకు ఇవ్వొచ్చు. ఎవరు కొన్నారు..ఎంత కొన్నారు అన్న వివరాలేమీ బయటకు రావు. అంతా రహస్యం. ఆ బాండ్లు కొనడానికి డబ్బులు నీతిగా సంపాదించారా.. నిజాయితీగా సంపాదించారా అన్న సంగతి కూడా చెప్పాల్సిన పని లేదు. పోనీ పన్నులైనా కట్టారా అన్నది కూడా చెప్పాల్సిన పని లేదు. అంటే ఎలా సంపాదించినా సరే.. అది రాజకీయ పార్టీకి విరాళం ఇస్తే మంచిదయిపోయింది. కనీసం ఎవరు ఇచ్చారు అన్నది కూడా బయటకు రాదు. కానీ కేంద్రానికి తెలుస్తుంది. తమ వ్యతిరేక పార్టీకి ఇస్తే వారికి తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ బాండ్లు ఒక్క ఎస్బీఐ మాత్రమే అమ్ముతుంది. తమ కు కాకుండా వ్యతిరేక పార్టీలకు ఇచ్చిన వారిపై.. చతురంగబలాలపై దాడులు చేస్తారు. అంటే తాము మాత్రమే బలంగా ఉండాలి.. ఇతర పార్టీలన్నీ ఆర్థికంగా కుంగిపోవాలన్న వ్యూహం కూడా ఇందులో ఉంది. ఈ రాజకీయ కోణం పక్కన పెడితే.. అసలు ఇదంతా రాజ్యాంగ విరుద్ధమని .. చట్టబద్దమైన లంచాలను నిరోధించాల్సిన ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టులో పిల్ దాఖలయింది. సుదీర్గ విరామం తర్వాత చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వరుసగా మూడు రోజుల పాటు ఎలక్టోరల్ బాండ్లపై అభ్యంతరాలు.. ప్రభుత్వ వాదలను విని తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పటికిప్పుడు.. ఎలక్టోరల్ బాండ్ల అమ్మకంపై నిషేధం విధించాలన్న విజ్ఞప్తిని రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది.
బీజేపీ పంట పండించిన ఎలక్టోరల్ బాండ్లు
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వేల కోట్లు విరాళాలు సమీకరించుకుంది. ఎలక్టోరల్ బాండ్లు 2021-22 వరకు అన్ని రాజకీయ పార్టీలకు కలిపి రూ. 9,188 కోట్లకు పైగా విరాళాలుగా అందాయి. అందులో బిజెపికి 57 శాతం పైగా నిధులు అందగా, కాంగ్రెస్‌కు కేవలం 10 శాతం మాత్రమే అందాయి. 2016-17 నుంచి 2021-22 మధ్య, డేటా అందుబాటులో ఉన్న చివరి సంవత్సరం వరకు ఏడు జాతీయ పార్టీలు, 24 ప్రాంతీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మొత్తం రూ.9,188.35 కోట్ల విరాళాన్ని అందుకున్నాయి. ఇందులో కమలం పార్టీకి రూ.5,272 కోట్లు, కాంగ్రెస్‌కు కేవలం రూ.952 కోట్లు రాగా, మిగిలినవి ఇతర పార్టీలకు చేరాయి. జాతీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల విరాళాలలో గణనీయమైన పెరుగుదల ఉంది. 2017-18 నుంచి 2021-22 మధ్య 743 శాతం పెరుగుదల ఉంది. దీనికి విరుద్ధంగా, అదే సమయంలో జాతీయ పార్టీలకు కార్పొరేట్ విరాళాలు 48 శాతం మాత్రమే పెరిగాయి. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు రూ.1,148 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల విక్రయం జరిగింది. వీటివల్ల వివిధ పార్టీలకు చేరిన కోట్ల రూపాయలు నిధులు సమకూరాయి. 28వ విడత ఎలక్టోరల్ బాండ్లను అక్టోబర్ 4 నుంచి 14 వరకు విక్రయించగా, అక్టోబర్ 9న ఐదు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) అక్టోబర్‌లో మొత్తం రూ.1,148.38 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను విక్రయించింది. ఎస్బిఐ హైదరాబాద్ శాఖ రూ. 377.63 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను విక్రయించింది. ఇది మొత్తంలో దాదాపు 33 శాతం. ఎలక్టోరల్ బాండ్లు రూ. 1,000, రూ. 10,000, రూ. 1 లక్ష, రూ. 10 లక్షలు, రూ. 1 కోటి డినామినేషన్లలో అందుబాటులో ఉన్నప్పటికీ, అతిపెద్ద డినామినేషన్ ఎక్కువ మంది కొంటున్నారు. కొనే వాళ్లలో అత్యధికాలు బీజేపీకి సమర్పించుకుంటున్నారు.
తమకు మాత్రమే చట్టబద్దమైన లంచాలు అందేలా చేసుకున్న బీజేపీ
పొలిటికల్ ఫండింగ్‌లో పారదర్శకత కోసం అంటూ నేరుగా నగదు విరాళాలు కాకుండా దానికి ప్రత్యామ్నాయంగా ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టారు. మార్చి 2018లో తొలిసారి ఎలక్టోరల్ బాండ్లను విక్రయించడం మొదలుపెట్టారు. కేవలం స్టేట్ బ్యాంక్ ఇండియాలో మాత్రమే ఆ బాండ్లను విక్రయిస్తారు. ఎలక్టోరల్ బాండ్లను భారతీయ పౌరులు లేదా దేశంలో విలీనం చేసిన లేదా స్థాపించబడిన సంస్థలు కొనుగోలు చేయవచ్చు.గత లోక్‌సభ లేదా శాసనసభ ఎన్నికలలో పోలైన ఓట్లలో ఒకశాతం కంటే తక్కువ కాకుండా ఓట్లు పొందిన రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు పొందేందుకు అర్హులు. ఈ పథకం ప్రకారం ఎలెక్టోరల్ బాండ్స్‌ను విడుదల చేసే అధికారం ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే వుంటుంది. అది ఏడాదిలోని ప్రతి త్రైమాసికం ప్రారంభంలో ఈ బాండ్లను కొనుగోలు చేసుకోడానికి పదేసి రోజుల వ్యవధిని ప్రకటిస్తుంది. విరాళాలు ఇవ్వదలచిన వారు ఆ వ్యవధిలో తాము కోరుకొన్న రాజకీయ పక్షాల పేరిట తమకు ఇష్టం వచ్చిన ద్రవ్యానికి బాండ్లను కొనుగోలు చేసుకొంటారు. లోక్‌సభ ఎన్నికల సంవత్సరంలో అదనంగా నెల రోజులు అవకాశం ఇస్తారు. ఆ బాండ్లను ఆయా రాజకీయ పార్టీలకు స్టేట్ బ్యాంకు అందచేస్తుంది. ఆ పార్టీలు తాము కోరుకొన్నప్పుడు వాటిని నగదు చేసుకొంటాయి. ఈ మొత్తం వ్యవహారం విరాళాలిచ్చే వ్యక్తులకు లేదా సంస్థలకు, స్టేట్ బ్యాంక్‌కు, వాటిని పొందే పార్టీలకు మాత్రమే తెలుస్తుంది. 2021లో ఇలా పొందిన బాండ్ల సొమ్ములో 60 ఒక్క భారతీయ జనతా పార్టీ ఖాతాలోనే జమ అయ్యాయి. ఆ ఏడాది 6500 కోట్ల బాండ్లు అమ్ముడు పోయాయి. కొనుగోలు చేసిన ఎలెక్టోరల్ బాండ్లలో 99 మేరకు రూ. కోటి, 10 లక్షలు మధ్య అమ్ముడు పోlgvdve/f. అంటే సంపన్న భారీ కార్పొరేట్లు మాత్రమే వాటిని కొనుగోలు చేస్తున్నాయి. 2019-20లో నాలుగింట మూడొంతుల నిధులు బీజేపీకే దక్కాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు దక్కింది కేవలం తొమ్మిది శాతమే. ఏడు జాతీయ పార్టీలు కలిపి తమ ఆదాయంలో 62 శాతాన్ని 2019-20లో ఈ ఎన్నికల బాండ్ల ద్వారా సంపాదించాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ ప్రకటించింది. ఆ డబ్బుతో ఆ పార్టీలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలుగుతాయి. ఇది ప్రజాస్వామ్య మౌలిక విలువలకే విఘాతమైనది. అయినా ఇప్పటికీ ఇది కొనసాగుతూనే వుంది.
ఎనిమిదేళ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్ – ఇప్పటికి విచారణ పూర్తి
సుప్రీంకోర్టులో ఎనిమిదేళ్ళుగా పెండింగ్‌లో ఉంది తమకు వచ్చిన బాండ్ల వివరాలను వెంటనే ఎన్నికల సంఘానికి సమర్పించాలని 2019 ఏప్రిల్‌లో ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ఈ బాండ్లకు సంబంధించిన వివరాలు ప్రజల దృష్టికి రాకుండా తప్పించుకోగలుగుతున్నాయి. అందుచేత ఇంత కాలానికి భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించారు. ఎట్టకేలకు విచారణ పూర్తి చేశారు. వాదనలు కూడా ఆసక్తికరంగా సాగాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం 2018లో తీసుకొచ్చిన ఈ పథకం ఆచరణలో గుప్పెట బిగించిందేగాని ఏ మాత్రం తెరవలేదని, ఈ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేవారి పేర్లు బయటపడకుండాను, వాటిని అందుకొనే పార్టీలు ఆ వివరాలను ఎన్నికల సంఘానికి కూడా తెలియజేయనవసరం లేకుండా చేసిందని సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన వారు చెబుతున్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా ఇప్పటి వరకూ సమకూరిన నిధుల్లో అత్యధిక భాగం కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయని ఏడీఆర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గణాంకాలను రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉంచారు. ఒక దశలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ…‘‘అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయి. దీనికి కారణమేమిటి’’ అని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం నిధులను ఎన్నికల సంఘం వద్ద ఉంచి, దాని ద్వారా అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయవచ్చు కదా అని ఆయన సూచించారు. ఎన్నికల బాండ్ల నిధుల మూలాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదని కేంద్రం వాదించింది.చివరికి 2023 సెప్టెంబర్ 30 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సీల్డ్ కవర్లో ఆ వివరాలు సమర్పించాలంది. తీర్పు ఎలా వస్తుందన్నది కీలకమే. ఎందుకంటే.. ఒక వేళ అనుకూలంగా వస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ విరాళాల పండగ చేసుకుంటుంది. అది చట్టబద్దమైన లంచం అవుతుంది.
ప్రమాదకరమైన విరాళాల వ్యవస్థ
ప్రజలు పన్నుల ద్వారా చెల్లించే సొమ్ముతో నిర్వహిస్తున్న ఎన్నికల మీద ప్రైవేటు విరాళాల ద్వారా రాజకీయ పార్టీలు పొందే అపారమైన నిధుల పెత్తనం ప్రజాస్వామ్యానికి హానికరం . ఈ విరాళాల పద్ధతి ప్రభుత్వాలతో పనులుండే సంపన్న కార్పొరేట్ యాజమాన్యాలు అధికారంలోకి రాగల అవకాశాలు అధికంగా వుండే పార్టీలకు ఇష్టావిలాసంగా నిధులు చెల్లించడానికి దోహదం చేస్తుంది. అధికారంలోకి వచ్చే పార్టీలు తమకు విరాళాలిచ్చిన సంస్థలకు లేదా వ్యక్తులకు అనుకూలంగా ప్రభుత్వాలను నడుపుతాయేగాని ప్రజలకు మేలు చేయవు. ఇందులో ఇతర పార్టీలను ఆర్థికంగా కుదేలు చేయాలన్న రాజకీయ కుట్ర కూడా ఉంది. తమకు మాత్రమే విరాళాలివ్వాలని.. విపక్షాలకు ఇవ్వకూడదు.. ఆర్థితంగా కట్టటి చేయాలన్న వ్యూహన్ని బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చేస్తోంది. ఎలక్టోరల్ బాండ్లు అందులో భాగం. మరి సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ?. తీర్పు ఏదైనా .. ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన హక్కులు ఉండేలా… చట్టబద్దమైన లంచాల వ్యవస్థను నిర్మూలించేలా ఉండాలన్నది ప్రజల కోరిక.