జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఆలస్యం అవుతోందని ఇతర రాష్ట్రాలకు తరలించాలని రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఎందుకు ఆలస్యమవుతున్నాయో చెప్పాలని సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐతో పాటు జగన్ ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరిలో జరగనుంది.
ఈ పిటిషన్ ధర్మాసనం ముందుకు విచారణ వచ్చిన వెంటనే… ధర్డ్ పార్టీ అయిన రఘురామకృష్ణరాజు ఎందుకు పిటిషన్ దాఖలు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. రఘురామకృష్ణరాజు ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తా అని అడిగింది. అయితే ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి కాదని.. వైసీపీకి చెందిన వ్యక్తేనని కోర్టుకు రఘురామ తరపు లాయర్ తెలిపారు.
రఘురామను సస్పెండ్ చేయకపోవడం వైసీపీకి పెద్ద మైనస్ గా మారింది. ఆయన తమ అధినేతపై పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయని.. అందరూ దొంగ అంటున్నారని.. తాను తట్టుకోలేకపోతున్నానని.. ఆయన స్వచ్చమైన కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని తాను పిటిషన్లు వేస్తున్నానని చెబుతున్నారు. ఇది సర్కాస్టిక్ గా ఉన్నా… అంగీకరించాల్సిన వాదనగా మారింది.