రాజన్న రాజ్యం తీసుకు వస్తానని హడావుడి చేసి చివరికి షర్మిల ఎన్నికల్లో పోటీ కూడా చేయలేని స్థితికి చేరిపోయారు. కాంగ్రెస్ లో విలీనం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసి విఫలమవడంతో.. అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పి.. చివరికి తాను కూడా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఎన్నికల నుంచి విరమించుకుంటున్నామని షర్మిల ప్రకటించారు. ఈఎన్నికల్లో కాంగ్రేస్ కు ఓటు వేయాలని పార్టీ సానుభూతిపరులకు షర్మిల పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ పై వ్యతిరేకత పెరిగిందని.. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చితే చరిత్ర తనను క్షమించదని షర్మిల వ్యాఖ్యానించారు. షర్మిల నిర్ణయంపై పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం కాలేదు. ఎందుకంటే షర్మిల పార్టీకి ఎక్కడా అభ్యర్థులు లేరు. స్వయంగా పాలేరులో తాను నిలబడాలనుకున్నా… కనీసం మూడు శాతం ఓట్లు కూడా రావని సర్వేల్లో తేలింది. ఈ ఎన్నికల్లో నిలబడి ఘోర పరాజయం పాలైతే.. తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్ పూర్తిగా అంధకారం అవుతుంది. తర్వాత ఏపీలో రాజకీయాలు చేయాలనుకున్నా.. పట్టించుకునేవారు ఉండరు.
అందుకే అన్నీ ఆలోచించి.. మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన కష్టాన్ని కూడా వదిలేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీ పెట్టుకున్న తర్వాత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నారు. ఓ వైపు జగన్ రెడ్డి ఆస్తులు పంచక..మరో వైపు ఏపీలో వ్యాపారాలు సరిగ్గా సాగక.. ఆమె పార్టీ నిర్వహణలో నానా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. చివరికి .. కాంగ్రెస్ కు మద్దతుగా పోటీ నుంచి ఉపసంహరణ నిర్ణయం తీసుకుని రిలీఫ్ పీలయ్యారు.