తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ హాట్ ఫేవరేట్ అయిపోయిది. తాము మద్దతిస్తాం తీసుకోండని చిన్న పార్టీలు వెంట పడుతున్నాయి. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలబడాలని అనుకుంది. కానీ చివరికి వచ్చే సరికి మన కాదులే అనుకుంది. కోదండరాం ఆలోచనను పసిగట్టిన రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి.. ఆయన మద్దతు కాంగ్రెస్ పార్టీకి ప్రకటించేలా చేసుకోగలిగారు. ఆ పార్టీకి ఎంత ఓటు బ్యాంక్ ఉంటుందన్న సంగతిని పక్కన పెడితే.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం మద్దతు లభించడం… కాంగ్రెస్ కు నైతిక బలమే.
ఇక ఎవరూ అడగకపోయినా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీకి చెందిన మఖ్య నేతలంటరూ నలుగురితో సమావేశమై.. కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. అసలు షర్మిల పార్టీ మద్దతే అవసరం లేదని కాంగ్రెస్ అనుకుంది. కానీ వదల బొమ్మాళి అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ప్రకటించి ట్విట్టర్లో ఓ లేఖ రాసి.. కాస్త గుర్తుంచుకోవాలన్నట్లుగా రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. దీంతో షర్మిల రాజకీయ పోరాటం తెలంగాణలో ముగిసినట్లయింది. ఇక టీడీపీ కూడా పోటీ నుంచి విరమించుకుంది. ఆ పార్టీ ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎవరు ఉన్నారో కానీ.. కాంగ్రెస్ పార్టీకే మేలు జరుగుతుందన్న అభప్రాయం మాత్రం వినిపిస్తోంది. ఇక కమ్యూనిస్టు పార్టీలు కూడా కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు రెడీగా ఉన్నాయి.
అయితే వారు ఒకటి, రెండు సీట్లు అడుగుతున్నారు. ఆ సీట్లు ఇచ్చి పొత్తు ప్రకటన చేసే దిశగా ఆలస్యం అవుతోంది. చివరికి కమ్యూనిస్టుల మద్దతు కాంగ్రెస్‌కే ఉండే అవకాశం ఉంది. ఎలా చూసినా.. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలకుంా తన ప్రయత్నం చేయకపోయినా గాలిని బట్టి కొన్ని పార్టీలు ముందుకు రావడం ఆ పార్టీలో నమ్మకం పెంచుతున్నాయి.