కాంగ్రెస్ గొప్ప పార్టీ అని.. వైఎస్ బతికుంటే ఈ పాటికే రాహుల్ ప్రధాని అయ్యే వారని చెబుతూ.. షర్మిల తన పార్టీని పోటీ నుంచి విరమించుకుని కాంగ్రెస్ కు మద్దతు పలికారు. ఈ అంశంపై జగన్ రెడ్డి తరపున సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి పక్క రాష్ట్ర రాజకీయాలను పట్టించుకోరన్నారు. విధానపరమైన నిర్ణయంలో భాగంగా షర్మిల కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి ఉండొచ్చన్నారు. కానీ కాంగ్రెస్ వైఎస్ కుటుంబాన్ని వేధించిందని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ పై ఏ పార్టీ వేధించి కేసులు పెట్టిందో ఆ పార్టీతో చేతులు కలపడాన్ని ఆమె ఇష్టానికే వదిలేస్తున్నామన్నారు.
నాడు సోనియా గాంధీని కలిసిన వారిలో షర్మిల కూడా ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆమె ఒక పార్టీకి అధ్యక్షురాలని, ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టం. మాకు ఈ రాష్ట్రానికి చెందిన విషయాలే ముఖ్యమని సజ్జల స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ, సోనియా వేధించారని సజ్జల చెబుతున్నారు. కానీ షర్మిల మాత్రం భిన్నంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, కుమారుడు కాంగ్రెస్ విషయంలో రెండు రకాలుగా మారడం ఆసక్తికరంగా మారింది. వైఎస్ చనిపోయిన తర్వాత సీఎం పదవి ఇవ్వలేదని జగన్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ పైనే కుట్రలు చేశారు.
కాంగ్రెస్ అండతో అడ్డగోలుగా సంపాదించుకుని.. ఆ సంపాదన తో పెట్టిన సాక్షిలో సోనియాపై దారుణమైన రాతలు రాశారు. తర్వాత సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనతో వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన మరణాన్ని తట్టుకోలేక వందల మంది చనిపోయారని.. వారిని ఓదార్చేందుకు ఓదార్పు యాత్ర చేశారు. పార్టీ అనుమతి ఇవ్వకపోయినా మందీ మార్బలంతో ఓదార్పు యాత్ర చేశారు. చివరికి కాంగ్రెస్ హైకమాండ్ అడ్డుకుంటోందని ఆరోపిస్తూ.. సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.
ఆ తర్వాత వైఎస్ ను సోనియా హత్య చేశారని కూడా కుటుంబం అంతా ఆరోపించింది. ఇప్పుడు అవసరం వచ్చే సరికి.. షర్మిల కాంగ్రెస్ కు అవసరం లేకపోయినా మద్దతు ప్రకటించారు. రేపు కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా జగన్ రెడ్డి చేసే పని అదే.