గజ్వేల్ బరి నుంచి తప్పుకుంటానని ఈటల రాజేందర్ హైకమాండ్ కు తేల్చి చెప్పినట్లుగా బీజేపీలో ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఉన్న సానుభూతి, సానుకూల పవనాలు ఇప్పుడు లేవనీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడంతో అక్కడా గెలుపు కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఉందని ఈటల రాజేందర్ చెబుతున్నారు. అయితే ఈటల అసంతృప్తి వేరే ఉందని.. తనను బలి పశువును చేయడానికి ప్లాన్ చేశారని నమ్ముతున్నారని అంటున్నారు.
తనను నమ్ముకుని వచ్చినవాళ్లకు టికెట్లు ఇచ్చే విషయంలో పార్టీ మొండిగా వ్యవహరించడం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమకు వేములవాడ సీటు ఇవ్వాలని ఈటల పట్టుబడుతున్నారు. ఇదే స్థానం కోసం మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు తన కొడుక్కు ఇవ్వాలని జాతీయ నాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ టికెట్ అంశం ఎటూ తేలలేదు. విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వంటి కీలక నేతలతో కాంగ్రెస్ నాయకత్వం చర్చలు జరుపుతున్నది. వారిలో కొందరినైనా తమవైపు తిప్పుకోవాలనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ సైతం ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టింది.
. ఈటల చేరిన తర్వాత ఆయనకు చేరికల కమిటీ చైర్మెన్, ప్రచార కమిటీ బాధ్యతలను సైతం జాతీయ నాయకత్వం అప్పగించింది. కీలకనేతలెవ్వరూ బీజేపీలో చేరకపోగా..ఉన్నవాళ్లూ పార్టీని వీడుతున్నారనే విమర్శలను ఎక్కుపెడుతున్నారు. కార్యకర్తలే కాదు…ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న బీజేపీ నేతలందరూ ఇదే భావనలో ఉన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం బీసీ జపం చేస్తున్నా..ఆ పార్టీలో పాత, కొత్త నేతలకు టార్గెట్‌గా ఈటల రాజేందర్ అవుతున్నారు.