ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత నంబర్ కూడా వస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చి నఆయన లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియానే విడిచిపెట్టలేదని గుర్తు చేశారు. కవితను ఎలా విడిచిపెడతామంటూ ఆయన ప్రశ్నించారు. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో ఉందన్నారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. జాతీయ రాజకీయాలు కేసీఆర్ చేద్దామనుకుంటే.. లిక్కర్ కేసులో కవిత జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారంటూ ఎద్దేవా చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొదట బయటపడినప్పుడు అనురాగ్ ఠాకూరే.. ఎక్కువగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు. సౌత్ లాబీ నుంచి కవిత కీలక పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. చార్జిషీట్లు దాఖలు చేశాయి. మిగతా నిందితులు అందర్నీ అరెస్టు చేశారు. కానీ కవితను అరెస్టు చేయలేదు. సౌత్ లబీ నుంచి అందరూ అప్రూవర్లుగా మారారు. ఒక్క కవిత మాత్రమే నిందితురాలిగా ఉన్నారు. ఆమె తనపై విచారణ జరగకుండా.. ఈడీ విచారణకు పిలవకుండా.. సుప్రీంకోర్టుకు వెళ్లి రెండు నెలల పాటు రిలీఫ్ తెచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ కేసు విచారణ ఆగింది. నవంబర్ నెలలోనే కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయనకు ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ విచారణకుహాజరు కాలేదు. అయననూ అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ.. కవితను అరెస్టు చేయకపోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందమన్న ప్రచారం జరుగుతోంది. అయితే అది ఎన్నికల ఫలితాలను బట్టి ఉండొచ్చని ఠాకూర్ మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చంటున్నారు.