ఎన్నికల కోసం బీజేపీ హైకమాండ్ హడావుడిగా 14 కమిటీలు వేసింది. వారిలో పని చేసే వారు లేకపోగా అనేక మంది పార్టీ నుంచి వెళ్లిపోయారు. మ్యానిఫెస్టో, స్క్రీనింగ్ కమిటీల చైర్మెన్లు, ఎలక్షన్స్ ఇష్యూస్ కమిటీ కన్వీనర్ కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. పోరాటాల కమిటీ చైర్మెన్ విజయశాంతి సొంత పార్టీపైనే పోరాటం చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలను ప్రభావితం చేసేందుకు వేసిన ప్రభావిత కమిటీ చైర్మెన్ కూడా పక్క పార్టీ కి ప్రభావితమవుతున్నారు. దీనిపై బీజేపీలోనే సెటైర్లు పడుతున్నాయి.
అభ్యర్థులను ఫైనల్ చేసే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ పోస్టును ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ కట్టబెట్టింది. ఆయన గుడ్ బై చెప్పారు. దాంతో అభ్యర్థుల ఎంపిక గందరగోళం అయిపోయింది. బీజేపీ మ్యానిఫెస్టో రూపకల్పన చైర్మెన్‌గా వివేక్‌ను నియమించారు. కానీ ఆయన తిరిగి సొంత గూటికే చేరారు. ఆయన వెళ్లిపోవడం, ఆయన సహకారిగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సైతం సైలెంట్‌గా ఉంటుండటంతో మ్యానిఫెస్టో రూపకల్పన చేయడం బీజేపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది.
ఎలక్షన్ ఇష్యూస్ కమిటీ కన్వీనర్ పోస్టుకు కపిలవాయి దిలీప్‌కుమార్ రాంరాం చెప్పేశారు.బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఎన్నికల వేళ నాయకులందర్నీ సమన్వయ పరిచేందుకు, జాతీయ, రాష్ట్ర నేతల మధ్య కో-ఆర్డినేషన్ ఉండేలా చేసేందుకు బీజేపీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కేంద్రం సమన్వయ కమిటీ చైర్మెన్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమించింది. ఆయనకు గవర్నర్ పదవిని కట్టబెట్టింది. త్రిపుర రాష్ట్రానికి పంపించింది. దీంతో రాష్ట్ర కేంద్రంలో సమన్వయం కరువైంది. మొత్తంగా బీజేపీ పరిస్థితి దారుణంగా మారిపోయింది.