వీడియోలు వైరల్ అయితే కారు గుర్తుకు ఓట్ల పంట పండుతుందని కేటీఆర్ అనుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ సోషల్ మీడియాపైనే ప్రధానంగా దృష్టి సారించారు. గులాబీ జెండాలె రామక్క అంటూ సాగే రీల్స్ ను ప్రతి ఒక్కరితో చేయిస్తున్నారు. ఇందు కోసం ఎలక్షన్ మేనేజ్ మెంట్ కోసం పెట్టుకున్న వ్యవస్థ.. అందులోని సభ్యులు ప్రతి నియోజకవర్గంపై దృష్టి పెట్టి అభ్యర్థులతో డాన్సులు చేయిస్తున్నారు. రీల్స్ చేయిస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయిస్తున్నారు.
ఇది వైరల్ వీడియో అంటూ… సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. లాస్ ఎంజెల్స్ దగ్గర్నుంచి సిద్దిపేట ఐటీ టవర్ వరకూ ఈ వీడియోలు చేయిస్తున్నారు. ఇందు కోసం ఎంత ఖర్చవుతుందో కానీ… చాలా సులువుగా కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. అవే వీడియోలు డౌన్ లోడ్ చేసుకుని దానికి గులాబీల దొంగలే రామక్క అని రీమిక్స్ చేసి.. సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఖర్చంతా బీఆర్ఎస్ అవుతోంది.. కానీ కాంగ్రెస్ మాత్రం. .. వారి వీడియోలు తీసుకుని వారికి కౌంటర్ ఇస్తోంది.
పదేళ్లుగా ప్రభుత్వంలో ఉన్న పార్టీకి పని తీరే ప్రచారం. సోషల్ మీడియా రీల్స్.. ప్రత్యర్థులపై ఫేక్ ప్రచారాలు చేస్తే… గెలిచేస్తారనుకోవడం అవివేకమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. పదేళ్లలో నిరుద్యోగలు, రైతులు సహా అన్ని వర్గాలను గోస పెట్టారని… కొంత మందికి మేలు చేసి ప్రజలందర్నీ ఆశ పెట్టారని వారంతా.. ఈ రీల్స్ చూసి మరింత వ్యతిరేకత పెంచుకుంటారు కానీ… బీఆర్ఎస్ కు ఓటు వేయరని చెబుతున్నారు. అయితే కేటీఆర్ మాత్రం సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.