సచిన్‌లోని దూకుడు..
ద్రావిడ్ లోని కచ్చితత్వం.. కలిస్తే రచిన్ రవీంద్ర!
ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో ఈ పేరు మార్మోగిపోతోంది. భవిష్యత్త్ సూపర్ స్టార్ అతనే… అంటూ క్రికెట్ పండితులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇంతకీ ఎవరీ రచిన్.. ఏమిటీ ఇతగాడి ఘనత.
రచిన్లో ఇద్దరు భారత సూపర్ స్టార్ల పేర్లు కలిసి ఉన్నాయి. సచిన్, ద్రావిడ్ పేర్లలోని మొదటి అక్షరాలతో తన బిడ్డకు నామకరణం చేశారు.. రవి క్రిష్ణమూర్తి. బెంగళూరుకి చెందిన కృష్ణమూర్తి.. ఆ తరవాత ఉద్యోగ రీత్యా న్యూజీలాండ్ లో స్దిరపడ్డారు. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్లబ్ తరపున ఆడారుకూడా. సచిన్, ద్రావిడ్ లకు వీరాభిమాని. వాళ్ల పేర్లు కలిసేలా.. తన బిడ్డకు రచిన్ అని పేరు పెట్టారు. తనే.. ఇప్పుడు వరల్డ్ క్రికెట్ లో తన ఆగమనాన్ని ఘనంగా చాటిన రచిన్ రవీంద్ర.
కెరీర్లో తన తొలి వరల్డ్ కప్ ఆడుతున్న రచిన్ రవీంద్ర ఇప్పటి వరకూ 3 సెంచరీలు చేసిన రచిన్.. మొత్తంగా 523 పరుగులతో టాప్ 2 స్థానాన్ని దక్కించుకొన్నాడు. తొలి స్థానంలో డికాక్ (సౌతాఫ్రికా) ఉన్నాడు. తొలి వరల్డ్ కప్‌లో 3 సెంచరీలు చేసిన రికార్డ్ ని రచిన్ సొంతం చేసుకొన్నాడు. ఎడమ చేతి వాటంతో బ్యాటింగ్ చేసే రచిన్… కచ్చితత్వానికీ, దూకుడుకూ మారు పేరుగా నిలుస్తున్నాడు. నిజానికి రచిన్ తన కెరీర్‌ని స్పిన్నర్‌గా మొదలెట్టాడు. ఆ క్రమంలో బ్యాటింగ్ లో మెళకువలు నేర్చుకొన్నాడు. క్రమంగా ఇప్పుడు ఓపెనర్ గా కుదురుకున్నాడు. ఈ వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో సెంచరీ చేసి తనపై అందరి దృష్టి పడేలా చేసుకొన్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు. కనీసం ప్రత్యర్థులకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా క్లీన్ ఇన్నింగ్స్ ఆడాడు. రచిన్ బ్యాటింగ్ శైలి చూసి.. వెటరన్లు కూడా మురిసిపోతున్నారు. ఓ కోహ్లీలా సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు రచిన్లో కనిపిస్తున్నాయని కొనియాడుతున్నారు. ఇప్పటికే న్యూజీలాండ్ తరపున పలు రికార్డులు బద్దలు కొట్టిన రచిన్… భవిష్యత్తులో సచిన్, ద్రావిడ్ అంత స్థాయికి ఎదిగినా ఆశ్చర్యం లేదు. న్యూజీలాండ్ ఈ వరల్డ్ కప్‌లో మరిన్ని మ్యాచ్‌లు ఆడాల్సివుంది. ఇక తదుపరి మ్యాచ్‌లలో అందరి దృష్టీ.. ఈ యమర్జింగ్ ప్లేయర్‌పైనే అనడంలో ఎలాంటి సందేహం లేదు.