కాంగ్రెస్ కమ్యూనిస్టుల్లో రెండు పార్టీలతో కాకుండా ఒక్క సీపీఐతోనే సర్దుకుపోవాలని నిర్ణయించుకుంది. సీపీఐకి ఒక్క చోట అదీ కూడా కొత్తగూడెం ఆఫర్ చేసింది. గెలిచిన తర్వాత మరో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పింది. దానికి సీపీఐ ఏదో ఒకటి అనుకోక తప్పడం లేదు. సీపీఎంకు అలాంటి ఆఫర్ కూడా ఇవ్వకపోవడంతో ఒంటరిపోటీకి సిద్ధమైంది. పధ్నాలుగు మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది. సీపీఐ, సీపీఎంతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ అనుకుంది. కానీ, సీట్ల సర్దుబాటు విషయంలో వీరి మధ్య పొత్తు వ్యవహారం కొలిక్కిరాలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలంటే మూడు నియోజకవర్గాలను తమకు కేటాయించాలని సీపీఐ ముందు నుంచి పట్టుబడుతుంది. వాటిలో కొత్తగూడెం, చెన్నూరు, మునుగోడు నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే, మునుగోడు అభ్యర్ధిని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చెన్నూరు, కొత్తగూడెం నియోజకవర్గాలపై సీపీఐ ఆశలు పెట్టుకుంది. కానీ వివేక్ పార్టీలో చేరడంతో ఆయనకు చెన్నూరు ఖాయం చేశారు. ఇక మిగిలింది కొత్తగూడమే. అక్కడ కూడా జలగం వెంకట్రావు పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారు. కానీ త్యాగం చేస్తామని కాంగ్రెస్ చెప్పడంతో సీపీఐకి లేటు చేస్తే అది కూడా జారిపోతుందని కంగారు పడింది.
సీపీఐకు కేటాయించిన కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీచేసే అవకాశం ఉంది . చివరికి సీపీఐ కూడా తమతో కలసి వచ్చే అవకాశాలు లేకపోవడంతో.. సీపీఎం ఒంటరి పోటీ ప్రకటన చేసింది. ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే చివరి క్షణంలో ఒక్క సీటు అయినా ఇచ్చి సీపీఎంను తప్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.