ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ జిల్లాలను పునర్వ్యవస్థీకరించే ఆలోచన చేస్తోంది. ముందూ వెనుకా ఆలోచించకుండా చేసిన జిల్లాల వల్ల రాజకీయంగా పెద్ద దెబ్బపడిందని ఇప్పుడు వైసీపీ అర్థమవుతోంది. వైసీపీ చాలా జిల్లాల్లో విభజన కారణంగా ప్రభావం కోల్పోతోందని చివరికి ఉమ్మడి కడప జిల్లాలో భాగమైన అన్నమయ్య జిల్లాలో అడ్రస్ లేకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని తేలడంతో జగన్ రెడ్డి వెంటనే… రివర్స్ గేమ్ ప్రారంభిస్తున్నారు. జిల్లాలను మళ్లీ పూర్తిగా మార్చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
పార్లమెంట్ స్థానానికి ఓ జిల్లా చొప్పున ఇరవై ఐదు జిల్లాలను ఏర్పాటు చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కానీ ఇరవై ఆరు ఏర్పాటు చేశారు. ప్రస్తుతమున్న 26 జిల్లాల సంఖ్యను పార్లమెంటు స్థానాలకు సమానంగా 25కు తగ్గించాలని అనుకుంటున్నారు. కారణం ఇది అయినా అసలు నిజం మాత్రం రాజకీయ ప్రయోజనాలు. అన్నమయ్య జిల్లా ఏర్పాటు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కడప జిల్లా చేజారిపోతుందన్న అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమవుతోంది. కడప జిల్లాను అలానే ఉంచి, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి నియోజక వర్గాలను చిత్తూరు జిల్లాలో కలపాలని భావిస్తున్నారు. అన్నమయ్య జిల్లాను రద్దు చేస్తారని తెలియగానే అలాంటిదేమీ లేదని.. రాయచోటి ఎమ్మెల్యే చెబుతున్నారు. కానీ చర్చల్లో ఆయన కూడా పాల్గొంటున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి.
అనంతపురం జిల్లాను తిరిగి పూర్వస్థాయికి తీసుకురావాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సత్యసాయి జిల్లాను రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం. విభజన తరువాత మారిన రాజకీయ పరిస్థితులు కూడా దీనికి కారణం. జిల్లాల విభజన అస్తవ్యస్థంగా జరిగింది.అందుకే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే.. జిల్లాలను పూర్తిగా పునర్ వ్యవస్థీకరిస్తామని ప్రకటించింది. తామే ఆ పని ముందు చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.