టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు, వైసీపీ నేతలు తమ హిట్ లిస్టులో పెట్టుకున్న కిలారు రాజేష్ పై హైదరాబాద్ లో ఓ దుండగుడు రెక్కీ నిర్వహించిన ఘటన సంచలనం రేపుతోంది. కిలారు రాజేష్ జూబ్లిహిల్స్ లోని జర్నలిస్టు కాలనీ నుంచి తన కుమారుడ్ని స్కూల్ నుంచి తీసుకు వచ్చేందుకు మధ్యాహ్నం సమయంలో కారులో బయటకు వచ్చారు. అయితే ఆయనను ఓ కారుతో పాటు రెండు బైకులతో కొంత మంది వ్యక్తులు ఫాలో కావడం గమనించాడు. ఏదో కుట్ర జరుగుతోందని భావించి కుమారుడ్ని తీసుకు రావాలని తన భార్యకు చెప్పి.. వేరే మార్గం ద్వారా రాజేష్ వెళ్లాడు. రాజేష్ ఎక్కడికి వెళ్లినా వారి వెనుకాలే దుండగులు ఫాలో అయ్యారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్.. నుంచి మళ్లీ బంజారాహిల్స్ వచ్చిన అదే విధంగా ఫాలో అయ్యారు. అల్కాజర్ కాంప్లెక్స్ వద్ద కారు ఆగిన సమయంలో.. TS 12 AK 8469 నంబర్ గల బైకుపై వచ్చిన దండగుడు బెదిరించే ప్రయత్నం చేశారు. మా సార్ నిన్ను ఫాలో అవమన్నారని చెప్పాడు. ఎవరు ఆ సార్ అంటే మాత్రం చెప్పలేదు. తర్వాత టీవీ5 కార్యాలయం వరకూ ఆ దుండగుడు రాజేష్ కారును అనుసరించాడు. దీంతో భయాందోళనలకు గురైన కిరారు రాజేష్ దుండగుడిపై జూబ్లీహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య, పిల్లలకు ప్రాణహాని కలిగించేలా దుండగుడి తీరు ఉందని ఫిర్యాదు చేశాడు. దుండగుడు వెంబడించిన బైక్ నంబర్ ఫేక్ అని తేలింది. దుండగుడి ఫోటోలు, బైక్ వివరాలు పోలీసులకు రాజేష్ అంద చేశారు. 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు. వైసీపీ నేతలు కిలారు రాజేష్ పై అనేక రకాల ఆరోపణలు చేశారు. ఆయనపై కేసులు కూడా పెట్టారు. ఇటీవల సీఐడీ విచారణకు కూడా హాజరయ్యారు.
ఇప్పుడు ఆయనకు..ఆయన కుటుంబానికి హానీ కలిగించేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. టీడీపీ నేతల్ని కేసులతో పాటు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. కిలారు రాజేష్ పై రెక్కీ నిర్వహించిన ఆ వ్యక్తి ఎవరు అన్నది తేలితే కుట్రేమిటో బయటపడే అవకాశం ఉంది.