తెలంగాణలో అధికార పార్టీతో పాటు బీజేపీ నేతల జోలికి వెళ్లని ఐటీ అధికారులు పదేళ్లుగా అధికారంలో లేని కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లపై మాత్రం విరుచుకుపడుతున్నారు. రెండు రోజుల కిందట తనపై ఐటీ దాడులు చేయబోతున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అన్నట్లుగానే ఆయన ఇంటిపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. తెల్లవారు జామునే ఎనిమిది వాహనాల్లో వచ్చి న ఐటీ అధికారులు పొంగులేటి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపీలో పెద్ద ఎత్తున కాంట్రాక్టులు చేస్తున్నారు. సీఎం జగన్ కు సన్నిహితుడు. తన కుటుంబసభ్యులకు ఇచ్చినంత ప్రయారిటీ .. పొంగులేటి కంపెనీలకు ఇచ్చి… ప్రాజెక్టులు, టెండర్లు కట్టబెడుతూంటారు సీఎం జగన్ రెడ్డి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరారు. పాలేరు నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ నేతల గెలుపు బాధ్యతను ఆయన తీసుకున్నారని చెబుతున్నారు. డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడతారన్న పేరు ఉంది.
ఇలాంటి బెదిరింపులకు తాను తలొగ్గబోనని… ఖమ్మంలో.. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రానివ్వబోనని.. చాలెంజ్ చేస్తున్నారు. దీనిపై కేసీఆర్ కూడా ప్రచార సభల్లో విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయనపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. బుధవారం మాజీ మంత్రి తుమ్మల ఇంట్లో ఈసీ స్క్వాడ్ తనిఖీలు చేసింది. మొత్తంగా తెలంగాణ ఎన్నికల్లో టార్గెట్ అంతా.. కాంగ్రెస్ గానే కనిపిస్తోందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.