ప్రజాప్రతినిధులపై తీవ్రమైన నేరాల విషయంలో ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచనలు చేసింది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన నేతలను ఎన్నికలలో పోటీచేయకుండా నిషేధించాలన్న అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. నేతలపై దాఖలైన కేసుల విచారణకు మార్గదర్శకాలను సూచించింది. ప్రజా ప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసులను త్వరిత గతిన విచారించాలని హైకోర్టులకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కేసుల సత్వర పరిష్కారానికి వెబ్సైట్ను సిద్ధం చేయాలని ఆదేశించింది.
అయితే దోషిగా తేలిన ఎంపీ/ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. ఇప్పటికి దోషిగా తేలితే ఆరేళ్ల పాటు నిషేధం ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల సత్వర విచారణకు మార్గం సుగమం అయినట్లే. తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ అంటే.. అందరికీ గుర్తు వచ్చేది జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులే. చార్జిషీట్లు దాఖలు చేసి పదేళ్లు అయినా ట్రయల్ కు రాకుండా వేల కొద్దీ వాయిదాలు… వందల కొద్దీ పిటిషన్లు వేసిన జగన్ రెడ్డి వ్యవహారమే కళ్ల ముందు కనిపిస్తుంది.
గతంలో ప్రజాప్రతినిధులపై కేసులను ఏడాదిలోపు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. రోజువారీ విచారణ కూడా ప్రారంభమయింది. అయితే తర్వాత ఎంత వేగంగా జరిగాయో అంత ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుతం జగన్ రెడ్డి కేసులు సీబీఐ కోర్టులో నెలకోసారి కూడా విచారణకు రావడం గగనంగా మారింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో పాటు .. జగన్ కేసులను వేగంగావిచారణ జరపాలని సుప్రీంకోర్టు.. హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లతో.. కేసుల విచారణలో కదలిక రావడం ఖాయంగా కనిపిస్తోంది.