కరువు కొంచెమే ఉందంటూ జగన్ రెడ్డి రైతుల్ని గాలికొస్తున్న వైనంపై కలసికట్టుగా పోరాడి రైతులకు నష్టపరిహారం అందించేలా ప్రభుత్వంపై పోరాడాలని టీడీపీ, జనసేన నిర్ణయించుకున్నాయి. విజయవాడలోని ఓ హోటల్లో రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతుల గురించి పోరాడాలని నిర్ణయించుకున్నారు. అంతా బాగుందని జగన్ రెడ్డి చెప్పడం .. రైతుల్ని కరువుకు వదిలేయడమేనని.. 32 శాతం లోటు వర్షపాతం నమోదయి లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతే .. అంతా బాగుందని ఎలా చెప్పారని సమన్వయ కమిటీలోని నేతలు ఆశ్చర్యపోయారు.
సాగు నీటి విడుదలలో, కాలువల నిర్వహణలో అధికార యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా ఉంది. ఈ దుర్భర పరిస్థితుల్లో కరవు మండలాలు గుర్తించి ప్రకటించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని గుర్తించారు. నష్టపోయిన రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ రూపంలో పంట నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలన్న డిమాండ్‌తో ఉద్యమం చేయనున్నారు. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.. వచ్చే జేఏసీ సమావేశం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు..
ఈ నెల 14, 15, 16 తేదీల్లో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు ఉంటాయని.. ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలోనే ఖరారు చేస్తాం.. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై రెండు పార్టీల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఈ నెల 13వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ కానుందని చెబుతున్నారు. చంద్రబాబు కేసులపై పూర్తి స్పష్టత వచ్చాక.. పవన్, చంద్రబాబు ఉమ్మడి బహిరంగసభలు పెట్టనున్నారు.