ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ రెండు, మూడు వందల ఎకరాలు ఉంటుందని అటు వైపు వెళ్లిన వాళ్లు చెబుతూ ఉంటారు. అది ఎన్ని ఎకరాలైనా ఉండవచ్చు కనీ.. అది కేసీఆర్ ది కాదు. ఈ విషయాన్ని కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు. నామినేషన్ సందర్భంగా ఆస్తులపై డిక్లరేషన్ ఇచ్చారు. అందులో తన పేరిట ఎలాంటి భూమి లేదని స్పష్టం చేశారు. మరి ఆ ఫామ్ హౌస్ సంగతేమిటంటే.. అది మొత్తం కుటుంబం పేరును చూపారు.
కుటుంబానికి ఉమ్మడిగా 62 ఎకరాలు ఉండగా, ఇందులో 53.30 ఎకరాలు సాగుభూమి కాగా, 9.36 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉన్నట్లు తెలిపారు. హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందినట్లుగా ఆస్తులను కేసీఆర్ డిక్లేర్ చేశారు. అందుకే తన పేరుపై భూములు లేకుండా పోయాయి. అయితే తన స్థిరాస్తులు మొత్తం రూ. 58.17 కోట్లు ఉంటాయన్నారు. నగదు, డిపాజిట్లు, టీ-న్యూస్‌లో పెట్టుబడులు వంటి చరాస్తులు రూ. 35.42 కోట్లు ఉంటాయని చూపించారు. అప్పు కూడా భారీగానే ఉంది. కేసీఆర్‌కు వ్యక్తిగతంగా రూ. 17.12 కోట్లు అప్పు ఉందన్నారు. కుటుంబానికి సంబంధించి రూ. 7.23 కోట్లు అప్పు ఉన్నట్లు తెలిపారు. కార్లు లాంటివేమీ లేవు కానీ.. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీల్లాంటి 14 వాహనాలు ఉన్నాయని చెప్పారు.
2018లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రకటించిన అఫిడవిట్‌కు ఇప్పటి అఫిడవిట్‌కు చాలా తేడా ఉంది. అప్పట్లో చరాస్తుల విలువను రూ. 10.40 కోట్లు . స్థిరాస్తులును రూ. 12.20 కోట్లుగా చూపించారు. ఎర్రవెల్లి గ్రామంలోని 54 ఎకరాల వ్యవసాయ భూమిని తన పేరుపైనే ఉన్నట్లుగా చూపించారు. ఈ సారి అఫిడవిట్ ను పూర్తిగా మార్చేశారు.