లుకౌట్ నోటీసులు సీఐడీ పొరపాటున ఇస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా సీఐడీ లాయర్ హైకోర్టుకు చెప్పారు. ఇలా నోటీసులు ఇచ్చి పొరపాటున ఇచ్చామని కవర్ చేసుకునే దర్యాప్తు సంస్థలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా.. అలాంటి సంస్థలపై కోర్టులు ఎలా స్పందిస్తాయన్నది తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు చెప్పిన కారణం మాత్రం.. అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. హైకోర్టులో సీఐడీ ఇలా చెప్పిందంటే.. రేపు తాము పెట్టిన కేసులన్నీ పొరపాటున పెట్టామని వాదించినా ఆశ్చర్యం లేకపోవచ్చు. అసలేం జరిగిందంటే.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. విచారణలో తనను నిందితుడుగా పేర్కొంటూ.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారని అదే సమయంలో మళ్లీ మళ్లీ 161, 91 కింద నోటీసులు ఇచ్చారని కోర్టు దృష్టికి కిలారు రాజేష్ తరపు న్యాయవాది దృష్టికి తీసుకెళ్లారు.
అప్పుడు గతుక్కుమన్న సీఐడీ లాయర్ తాము ఎల్ఓసీ పొరపాటున ఇచ్చామని చెప్పుకొచ్చారు. తాము రాజేష్‌ను నిందితుడిగా పేర్కొనలేదని సీఐడీ న్యాయవాది చెప్పారు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని సీఐడీ న్యాయవాదులు కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టుల ఈనెల 17కు వాయిదా వేసింది.
సీఐడీ వ్యవహారశైలి చూస్తూంటే.. కోర్టులు ఎలా భరిస్తున్నాయో కానీ.. చట్టంతో చెలగాటం అడుతున్నారని ఎవరికైనా అర్థమైపోతుంది. ఆధారాల్లేని కేసులు పెట్టడం.. అడ్డగోలుగా అరెస్టులు చేయడం.. టార్గెట్ గా పెట్టుకున్న వారిని ఎలాగోలా కొన్నాళ్లు జైల్లో ఉంచడం అన్నట్లుగా సాగిపోతోంది. తెలంగాణ హైకోర్టులో కూడా ఇలా మార్గదర్శి ఎండీ మీద తప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేసి చీవాట్లు తిన్నది.