బీఆర్ఎస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగా టిక్కెట్లన్నీ ఆయన ఇచ్చినట్లుగా చెబుతూ వేల కోట్లు తీసుకున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ నేతలు చేసే ఆరోపణల్లో నిజానిజాలు సంగతి పక్కన పెడితే….కాంగ్రెస్ గెలిచినా రేవంత్ రెడ్డి సీఎం కారు అనే విషయాన్ని అంతర్లీనంగా ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో చాలా మంది సీఎం ఆశావహులు ఉన్నారని… ఆరు నెలలకో సీఎం అవుతారని అంటున్నారు. హరీష్ రావు ఇంటి విమర్శలు చేయడంలో ముందు ఉంటున్నారు.
తాజాగా ఓ టీవీ చానల్ ఇంటర్యూలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ అంశంపై సూటిగా స్పందించారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. సీఎం మారారా.? కాంగ్రెస్‌లో ఎవరైనా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చున్నారు. బీఆర్ఎస్లో సీఎం అవుతానని చెప్పే ధైర్యం హరీష్‌రావుకు ఉందా.?అలా చెబితే హరీష్ రావు ఉదయానికల్లా జైల్లో ఉంటారని సెటైర్ వేశారు.
బీఆర్ఎస్ పార్టీ అంతర్గత రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. 2018లో బీఆర్ఎస్ గెలిచిన తరవాత హరీష్ రావు ఎలాంటి దుర్బర పరిస్థితిని ఎదుర్కొన్నారో అందరికీ తెలుసు. ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి బయటకు పంపేసిన తర్వాత మాత్రమే మళ్లీ హరీష్ రావుకు ప్రాధాన్యం లభించింది. హరీష్ మనసులో ఏముంటుందో కానీ… రేవంత్ రెడ్డి లాంటి నేతలు మాత్రం చిన్న చిన్న సెటైర్లతో కొన్ని అంతర్గత విషయాలను హైలెట్ చేస్తూ ఉంటారు.